90 శాతం భారతీయ ఆవిష్కరణలు ’కాపీలే’

90percent of Indian innovations copied ideas - Sakshi

హాట్‌మెయిల్‌ సహ వ్యవస్థాపకుడు సబీర్‌ భాటియా

ముంబై: దాదాపు 90 శాతం భారతీయ ఆవిష్కరణలన్నీ ’కాపీక్యాట్‌ ఐడియాలే’నని హాట్‌మెయిల్‌ సహ వ్యవస్థాపకుడు సబీర్‌ భాటియా విమర్శించారు. క్రియేటర్ల దేశంగా మారేందుకు భారత్‌ ఇంకా సన్నద్ధంగా లేదని నాస్కామ్‌ టెక్నాలజీ అండ్‌ లీడర్‌షిప్‌ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. టెస్లా వంటి ఆధునిక సంస్థల ప్లాంట్లలో 300–400 మంది మాత్రమే పనిచేస్తున్న నేపథ్యంలో దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు మేకిన్‌ ఇండియా లాంటి కార్యక్రమాల వల్ల పెద్ద ఉపయోగం ఉండదని భాటియా చెప్పారు.

చైనా ఇప్పటికే తయారీ దేశ స్థానాన్ని ఆక్రమించినందున భవిష్యత్తులో తయారీ రంగానికి కాకుండా క్రియేటర్ల దేశానికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అయితే ఆ స్థాయికి ఎదిగేందుకు భారత్‌ ఇంకా సన్నద్ధంగా లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో సమస్యలను స్వతంత్రంగా గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు ఐడియాలను రూపొందించే దిశగా నిర్ణయాలు తీసుకోవడంలో వికేంద్రీకరణ విధానం అవసరమని భాటియా సూచించారు. ప్రజలు తమ సమస్యలను గుర్తించి, తామే పరిష్కరించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఎయిర్‌బీఎన్‌బీ, టెస్లా, ఉబర్‌ వంటి ఆవిష్కరణలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top