ఏమిటీ కోల్ గ్యాసిఫికేషన్ ?
బ్లాక్‌ల వారీగా వనరులు (బిలియన్ క్యూబిక్ మీటర్లలో)
సంస్థ వ్యాప్తంగా 19 బిలియన్ క్యూబిక్ మీటర్ల వనరులు
అందులో భద్రాద్రి – ములుగు పరిధిలోనే అధికం
గ్యాసిఫికేషన్ చేపడితే
జిల్లాకు పూర్వవైభవం ఖాయం
ఇక్కడే ఎక్కువ..
రాష్ట్రంలోని ఆరు జిల్లాల పరిధిలో సింగరేణి బొగ్గు వెలికితీస్తోంది. అయితే, భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా భూగర్భంలో కోల్ గ్యాసిఫికేషన్‌కు మూడు ప్రధాన బ్లాక్‌లు అనుకూలంగా ఉన్నట్టు సంస్థ గుర్తించింది. మంచిర్యాల, పెద్దపల్లి, కుమురం భీమ్ జిల్లాల పరిధిలో విస్తరించిన బ్లాక్‌ల్లో ఐదు బిలియన్ క్యూబిక్ మీటర్ల వనరులు ఉన్నాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుర్తించిన మరో బ్లాక్‌లో రెండు బిలియన్ క్యూబిక్ మీటర్ల బొగ్గు నిల్వలు నిక్షిప్తమై ఉన్నాయి. అలాగే, అతి పెద్దదైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల పరిధిలో విస్తరించిన మూడో బ్లాక్‌లో ఏకంగా 12 బిలియన్ క్యూబిక్ మీటర్ల నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. మొత్తంగా సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో ప్రాథమిక అంచనాల ప్రకారం 19 బిలియన్ క్యూబిక్ మీటర్ల మిథేన్ గ్యాస్‌ను కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా వెలికితీసే అవకాశం ఉంది.
ప్రధాన నిక్షేపాలు మన వద్దే..
ఇల్లెందులో బొగ్గు తవ్వకాలు 150 ఏళ్ల కిందటే ప్రారంభయ్యాయి. ప్రస్తుత స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్రాలు లేకపోవడం వల్ల వెలికితీసిన బొగ్గు కంటే, భూగర్భంలో మిగిలిపోయినదే ఎక్కువగా ఉంది. కొత్తగూడెం పరిస్థితి కూడా ఇంచు మించు ఇలాగే ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఇల్లెందు నుంచి గుండాల – మణుగూరు – తాడ్వాయి, టేకులపల్లి – అనిశెట్టిపల్లి – కొత్తగూడెం – చండ్రుగొండ, చర్ల, వెంకటాపురం(నుగూరు) తదితర ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలను గుర్తించారు. అయితే, ఈ బొగ్గు నిల్వలు భూఉపరితలం నుంచి ఎక్కువ లోతులో ఉన్నాయి. ఇక్కడ బొగ్గు వెలికితీయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం, ఈ ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో అనుమతుల సాధన కష్టంగా మారింది. దీంతో ఇన్నాళ్లు బొగ్గు తవ్వకాలు జరగలేదు. మరోవైపు ఓపెన్ కాస్ట్ పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక సింగరేణి దృష్టి మొత్తం రామగుండం, శ్రీరాంపూర్, మందమర్రి, భూపాలపల్లి ఏరియాలపైనే పెట్టింది. ఫలితంగా భద్రాద్రి జిల్లా వెనుకడుగు వేసినట్టయింది. అయితే, భవిష్యత్ మైనింగ్‌గా పేర్కొంటున్న కోల్ గ్యాసిఫికేషన్ నిల్వల్లో 70 శాతం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల పరిధిలో ఉండడం జిల్లా పరంగా సానుకూల అంశంగా మారనుంది.
మరోసారి
పూర్తిగా అడవులతో నిండిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి బొగ్గు గనులతోనే అభివృద్ధికి అడుగులు పడ్డాయి. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, పాల్వంచ, సారపాక వంటి పారిశ్రామిక ప్రాంతాలు ఎందరికో ఉపాధి కల్పించాయి. అయితే, గడిచిన ఇరవై ఏళ్లుగా సింగరేణి వెలుగు జిలుగులు రామగుండం, మంచిర్యాల(శ్రీరాంపూర్, మందమర్రి), భూపాలపల్లికే ఎక్కువగా పరిమితమైంది. ఫలితంగా ఒకప్పుడు ఇల్లెందు, కొత్తగూడెంలో వేలాది కుటుంబాలతో కళకళలాడిన కార్మికవాడలు నేడు వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం తెరపైకి వచ్చిన కోల్ గ్యాసిఫికేషన్‌తో మరోసారి భద్రాద్రి జిల్లాకు పారిశ్రమిక కళ సంతరించుకోనుందనే నమ్మకం కలుగుతోంది.
కోల్ గ్యాసిఫికేషన్ విధానంలో భూమి పొరల్లో నిక్షిప్తమైన బొగ్గు నిక్షేపాలపై మరింత ఒత్తిడి తీసుకొచ్చి, వెలుపలి నుంచి ఆక్సిజన్, ఇతర వాయువులను భూమిలోకి పంపడం ద్వారా సింథటిక్ గ్యాస్ తయారవుతుంది. దీన్ని ప్రాసెస్ చేయడం ద్వారా మిథనాల్, అమ్మోనియా, సింథటిక నేచురల్ గ్యాస్ (ఎన్‌ఎన్‌జీ), హైడ్రోజన్, లిక్విడ్ ఫ్యూయల్‌తో పాటు కొన్ని ప్రయోజనకరమైన రసాయన ఉత్పత్తులను పొందవచ్చు. ఇందులో సింథటిక్ నేచురల్ గ్యాస్ పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడితే, అమ్మోనియా ఎరువుల తయారీలో దిగుమతులు తగ్గించుకునేందుకు దోహదం చేస్తుంది. పైగా సంప్రదాయ మైనింగ్‌తో పోలిస్తే కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియలో కాలుష్యం కూడా తక్కువగా వెలువడుతుంది.
పరిధి వనరులు
మంచిర్యాల, పెద్దపల్లి, కుమురం భీమ్ 05
భద్రాద్రి కొత్తగూడెం 02
భద్రాద్రి కొత్తగూడెం, ములుగు 12
కోల్ గ్యాసిఫికేషన్‌పై సింగరేణి దృష్టి
ఇంధనం, ఎరువుల విషయంలో దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్రప్రభుత్వం
ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా కోల్ గ్యాసిఫికేషన్ రంగంలో
రూ.3లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వ వంతుగా కోల్ గ్యాసిఫికేషన్ ప్రయత్నాలు చేసే సంస్థలకు రూ.37,500 కోట్లతో ప్రోత్సాహకాలను
ప్రకటించింది. ఈ మార్పు జిల్లా పాలిట వరంగా మారుతుందనే అంచనాలు నెలకొన్నాయి.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం


