మహిళా పవర్‌ ! | - | Sakshi
Sakshi News home page

మహిళా పవర్‌ !

Apr 29 2026 7:36 AM | Updated on Apr 29 2026 7:36 AM

90 శాతం బ్యాంకు రుణం

‘ఇందిరా మహిళాశక్తి’ ద్వారా

రెండు యూనిట్లు

సుజాతనగర్‌, మణుగూరు

మండలాలు ఎంపిక

ఒక్కో మెగావాట్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అడుగులు

రైతుల స్థానంలో మహిళా సంఘాలు

వ్యవసాయ రంగంలో నానాటికీ విద్యుత్‌ వినియో గం పెరుగుతోంది. దీంతో థర్మల్‌, హైడల్‌ పవర్‌ ప్లాంట్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఈనేపథ్యాన వ్యవసాయ రంగంలో సోలార్‌ విద్యుత్‌ వాటా పెంచేందుకు కేంద్రం పీఎం కుసుమ్‌ పేరుతో కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. రైతులు సహకార, సంయుక్త పద్ధతిలో 0.5 మెగావాట్ల నుంచి 2 మెగా వాట్ల వరకు సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే కేంద్రం ప్రోత్సాహకాలను అందిస్తుంది. కానీ ఈ స్థాయిలో పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలంటే రెండు నుంచి పదిహేను ఎకరాల వరకు స్థలం అవసరమవుతుంది. రైతు సంఘాల దగ్గర ఆ స్థాయిలో భూములు అందుబాటులో లేవు. దీంతో ఇంచుమించు పీఎం కుసుమ్‌ తరహాలోనే మహిళా సంఘాలతో సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది.

జిల్లాలో రెండు యూనిట్లు

ఇందిరా మహిళా శక్తి పేరుతో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యాన జిల్లాలో ఒక మెగావాట్‌ సామర్థ్యం కలిగిన రెండు యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిచింది. ఈ మేరకు పైలట్‌ ప్రాజెక్టుగా సుజాతనగర్‌, ముణుగూరు మండలాలను ఎంపిక చేశారు. మండల సమాఖ్య సభ్యులు బృందంగా ఒక మెగావాట్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను నిర్వహిస్తారు. ఈ ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వమే ఎంపిక చేస్తుంది. 25 ఏళ్ల లీజుతో అప్పగించనుంది.

పదేళ్ల పాటు పూర్తి ఆదాయం

మహిళా సంఘాల ఆధ్వర్యాన ఏర్పాటుచేసే సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నుంచి సగటున ప్రతీరోజు 4,500 యూనిట్ల విద్యుత్‌ గ్రిడ్‌కు సరఫరా అవుతుంది. ప్రస్తుతం ఒక్క యూనిట్‌కు విద్యుత్‌ సంస్థలు రూ.3.13 చెల్లిస్తున్నాయి. ఈ లెక్కన నెలకు సుమారు రూ.4లక్షల ఆదాయం వస్తుంది. ఇందులో కొంత మొత్తాన్ని ప్లాంట్‌ నిర్వహణ ఖర్చులకు, మరికొంత భాగాన్ని మహిళా సమాఖ్యలకు కేటాయించి.. సింహభాగాన్ని బ్యాంకు రుణాల చెల్లింపునకు ఉపయోగిస్తారు. ప్రస్తుత అంచనాల ప్రకారం బ్యాంకు రుణం కనిష్టంగా పదేళ్ల నుంచి గరిష్టంగా 15 ఏళ్లలో తీరిపోతుంది. ఆ తర్వాత పదేళ్ల పాటు వచ్చే ఆదాయం మహిళా సమాఖ్యలకే చెందుతుంది. ఈ సొమ్మును స్వయం సహాయ సంఘాల అభ్యున్నతికి ఉపయోగిస్తారు.

ఒక మెగావాట్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అందుబాటులో ఉన్నస్థలం, అక్కడి భౌగోళిక పరిస్థితులను ఆధారంగా సగటున రూ.3 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులో పది శాతం పెట్టుబడిని మహిళా సమాఖ్యలు సమకూర్చుకోవాలి. మిగతా 90శాతం పెట్టుబడిని రుణాల రూపంలో బ్యాంకులు అందిస్తాయి. ఈ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. ఆపై వచ్చే ఆదాయం నుంచి నిర్వహణ ఖర్చులు పోగా నెలకు కొంత చెల్లిస్తే రుణభారం తగ్గుతుంటుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం మండలంలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు పనులు చివరి దశకు చేరగా, కల్లూరు మండలంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భద్రాద్రి జిల్లాకు సంబంధించి మండలాలు, మహిళా సమాఖ్యల ఎంపిక, స్థలం కేటాయింపుపై స్పష్టత రావడంతో త్వరలోనే పనులు మొదలుకానున్నాయి.

మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధి కోసం ఇప్పటికే బస్సులు ఇప్పించి ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నడిపిస్తున్నాయి. వీటిలో పాటు పెట్రోలు బంక్‌లు నిర్వహణలోనూ సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈనేపథ్యాన మరో అడుగు ముందుకేసి సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి రంగంలోనూ మహిళా సంఘాల సభ్యులకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు.

– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

Advertisement
 
Advertisement
Advertisement