మేలైన వ్యవసాయంకోసం.. | - | Sakshi
Sakshi News home page

మేలైన వ్యవసాయంకోసం..

Apr 29 2026 7:36 AM | Updated on Apr 29 2026 7:36 AM

● ‘రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు’ పేరిట సదస్సులు ● ఉమ్మడి జిల్లాలో 72 చోట్ల నిర్వహణ

● ‘రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు’ పేరిట సదస్సులు ● ఉమ్మడి జిల్లాలో 72 చోట్ల నిర్వహణ

ఖమ్మంవ్యవసాయం: ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వచ్చే వానాకాలం సీజన్‌ దృష్ట్యా పంటల సాగు, విత్తనాల ఎంపిక, ఎరువుల వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమం ద్వారా సదస్సులు నిర్వహిస్తారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం పర్యవేక్షణలో వ్యవసాయ శాఖ ద్వారా మొదలైన ఈ సదస్సులు వచ్చేనెల 23వ తేదీ వరకు కొనసాగుతాయి.

ఎరువులు, సుస్థిర ఆదాయం

ఎరువుల వినియోగం, సుస్థిర ఆదాయాన్ని పొందేలా, పంటలు సాగుచేసేలా రైతులకు ఈ సదస్సుల్లో అవగాహన కల్పిస్తారు. యూరియా వాడకం తగ్గింపుతో సాగుఖర్చును తగ్గించుకోవాలని.. తద్వారా నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే అంశాన్ని రైతుల్లోకి తీసుకెళ్తారు. ప్రధానంగా వరిలో 75 – 90 కిలోల యూరియాకు బదులు రైతులు 180 కిలోల వరకు వినియోగిస్తున్నారు. దీంతో వ్యయం పెరగడమే కాక భూగర్భ జలాలు విషతుల్యం కావటం, నేలలోని సూక్ష్మ జీవులకు హాని కలుగుతోంది. అవసరం మేరకు రసాయనాలను వినియోగిస్తే ప్రకృతిని రక్షించుకోవచ్చని, పంట మార్పిడి ద్వారా సుస్థిర ఆదాయాన్ని పొందాలని సదస్సుల్లో సూచిస్తారు. అంతేకాక మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలే సాగు చేసేలా చైతన్యం కల్పిస్తారు. అంతేకాకుండా పండ్ల తోటలు, పాడి పరిశ్రమ ఏర్పాటుతో లాభాలపై అవగాహన పెంపొందించాలని నిర్ణయించారు.

వరిలో సన్న రకాలు

జిల్లాలో వరి ప్రధానమైన పంటగా సాగవుతోంది. మద్దతు ధరకు తోడు ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్‌ చెల్లిస్తుండడంతో రైతులు సన్న రకాల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యాన తక్కువ విత్తన వ్యయం, నాణ్యత, విశ్వసనీయత, చీడపీడలను తట్టుకునేలా రకాల ఎంపికపై రైతులకు వివరిస్తారు. వరిలో కూనారం (కేఎన్‌ఎం 1638), తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌–15048), సాంబమసూరి (బీపీటీ–5204), సిద్ధి(డబ్ల్యూజీఎల్‌–44), జైశ్రీరామ్‌, హెచ్‌ఎంటీ సోనా వంటి రకాల ప్రత్యేకతలపై అవగాహన కల్పిస్తారు. ఇక కాటన్‌ దొర సన్నాలు (ఎంటీయూ–1010), కూనారం సన్నాలు (కేఎన్‌ఎం–118)పై వివరిస్తూ.. పత్తి, మొక్కజొన్న, వేరుశనగ సాగులోతీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు.

సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడాన్ని కూడా ఈ సదస్సుల్లో అజెండాగా చేర్చారు. సహజ వనరులు, సుస్థిర వ్యవసాయ విధానాలను అలవర్చుకునేలా రైతులను చైతన్యపర్చాలని నిర్ణయించారు. సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, పంటల మార్పిడి, జీవ కీటక నియంత్రణ, పచ్చిరొట్ట పంటల పెంపకం, మల్చింగ్‌, పంట అవశేషాలు నేలలో కలియదున్నడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు.

ఉమ్మడి జిల్లాలో సదస్సులు

‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’కార్యక్రమం ఈ నెల 27న మొదలుకాగా.. ఉమ్మడి జిల్లాలో 72 క్లస్టర్లు, గ్రామాల్లో వచ్చేనెల 23వ తేదీవరకు కొనసాగనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 52, ఖమ్మం జిల్లాలో 20 సదస్సుల నిర్వహణకు వేదికలు ఖరా రు చేశారు. అశ్వారావుపేట వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేట్‌ డీన్‌ హేమంత్‌కుమార్‌తో కూడిన శాస్త్రవేత్తల బృందంతో పాటు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కృషి విజ్ఞాన కేంద్రాల, పరిశోధనా స్థానాల శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు సదస్సుల్లో పాల్గొంటున్నారు. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల వ్యవసాయాధికారులు ధనసరి పుల్లయ్య, బాబూరావు పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement