రఘునాథపాలెం: మండలంలోని బూడిదంపాడులో మంగళవారం సాయంత్రం మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. గ్రామానికి చెందిన రైతు గుమ్మడి సత్యం చేనుకు తొలుత మంటలు అంటుకోగా.. ఆ తర్వాత విస్తరిస్తూ పక్కన ఉన్న నలుగురు రైతులకు చెందిన చేలకు కూడా మంటలు అంటుకున్నాయి. మొత్తం ఐదెకరాల్లో పంట నష్టం జరిగినట్లు సమాచారం. సాయంత్రం ఐదు గంటల సమయాన మంటలు మొదలుకాగా స్థానికులు అదుపుచేసే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. దీంతో అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో ఉద్యోగులు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.


