‘పరిషత్‌’ రిజర్వేషన్లపై ఉత్కంఠ | - | Sakshi
Sakshi News home page

‘పరిషత్‌’ రిజర్వేషన్లపై ఉత్కంఠ

Apr 27 2026 8:06 AM | Updated on Apr 27 2026 8:06 AM

ఎంపీటీసీ స్థానాలు

ఎన్నికల సంఘం ఆదేశాలతో ఓటరు జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు

జిల్లాలో 22 జెడ్పీటీసీ, 233

ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికల సందడి

పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు,

బ్యాలెట్‌ బాక్స్‌లు సిద్ధం

ఏర్పాట్లు చేస్తున్నాం

చుంచుపల్లి: ప్రాదేశిక ఎన్నికలకు ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీల పరిధిలో పంచాయతీలు, పోలింగ్‌ స్టేషన్‌ల వారీగా కొత్త జాబితాలు రూపొందించాలని, పోలింగ్‌ కేంద్రాలు, బ్యాలెట్‌ బాక్సులు ఇతర ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో గ్రామాల్లో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను గతేడాది సెప్టెంబర్‌లోనే నిర్వహించేందుకు ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించి అన్ని ఏర్పాట్లు చేయగా, హైకోర్టు ఆదేశాలతో చివరి నిమిషంలో ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే గతంలో ప్రకటించిన విధంగానే రిజర్వేషన్లను అమలు చేస్తారా? లేదంటే.. కొత్తగా చేపడతారా? అన్న సందేహం నెలకొంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆశావహులు ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఎక్కువ మందిలో మాత్రం రిజర్వేషన్లు ఎలా ఉంటాయన్నది తెలియక ఉత్కంఠకు గురవుతున్నారు. అన్నీ అనుకూలిస్తే మే చివరలో లేదా జూన్‌ ఆరంభంలో ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

రెండు విడతల్లో నిర్వహణకు ప్రతిపాదనలు

జిల్లాలో 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో జిల్లాలోని 22 ఎంపీపీ, 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించారు. అప్పట్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇస్తామని ప్రచారం చేశారు. అది అమలులోకి రాకపోవడంతో 27 శాతం బీసీలకు, 15శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు రిజర్వేషన్‌ కేటాయించి గ్రామపంచాయతీ ఎన్నికలు జరిపారు. ప్రాదేశిక ఎన్నికలకు కూడా అదే నిబంధన వర్తిస్తుంది. గతంలో కేటాయించిన బీసీ స్థానాల్లో మార్పులు ఉంటాయని, ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 6,69,048 మంది ఓటర్లు ఉన్నట్లు లెక్క తేలింది. ఇందులో పురుషులు 3,25,045 మంది కాగా, మహిళలు 3,43,979 మంది ఉన్నారు. ఇతరులు మరో 24 మందిగా గుర్తించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా 1,271 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. వీటికి రెండు విడతల్లో ఎన్నికలను నిర్వహించేలా కొత్తగా ప్రణాళిక తయారు చేశారు. జంబో బ్యాలెట్‌ బాక్సులు 1,811, మీడియం బాక్సులు 351 అందుబాటులో ఉంచారు. ఇవి కాకుండా మరో 1,000 బ్యాలెట్‌ బాక్సులు అదనంగా తెిప్పించి ఉంచారు.

అశ్వాపురం 12

అశ్వారావుపేట 11

భద్రాచలం 14

బూర్గంపాడు 17

చంద్రుగొండ 8

అన్నపురెడ్డిపల్లి 6

చర్ల 12

దమ్మపేట 17

దుమ్ముగూడెం 13

గుండాల 5

ఆళ్లపల్లి 5

జూలూరుపాడు 10

లక్ష్మీదేవిపల్లి 11

సుజాతనగర్‌ 5

చుంచుపల్లి 12

మణుగూరు 11

ములకలపల్లి 10

పాల్వంచ 10

పినపాక 9

కరకగూడెం 5

టేకులపల్లి 14

ఇల్లెందు 16

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో మరోసారి ఓటరు జాబితా సిద్ధం చేస్తున్నాం. గతంలోనే దాదాపు 90 శాతం పనులు పూర్తి చేసి ఉంచాం. షెడ్యూల్‌ ఎప్పుడొచ్చినా ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈసారి రెండు విడతల్లో పరిషత్‌ ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశాం.

– బి.నాగలక్ష్మి, జెడ్పీ సీఈఓ

Advertisement
 
Advertisement
Advertisement