భద్రగిరిలో జీర్ణోద్ధరణ.. | - | Sakshi
Sakshi News home page

భద్రగిరిలో జీర్ణోద్ధరణ..

Apr 27 2026 8:06 AM | Updated on Apr 27 2026 8:06 AM

● ఉపాలయాల్లో మూర్తులకు కళావాహన ● పూజల్లో పాల్గొన్న త్రిదండి చినజీయర్‌ స్వామి

● ఉపాలయాల్లో మూర్తులకు కళావాహన ● పూజల్లో పాల్గొన్న త్రిదండి చినజీయర్‌ స్వామి

భద్రాచలం: భద్రగిరి శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధిలో ప్రధాన ఘట్టం ఆదివారం ఆవిష్కృతమైంది. ఆలయ నిర్మాణం అనంతరం ఏకకాలంలో 15 ఉపాలయాల్లోని 72 మూలమూర్తులకు, మూడు గోపురాలకు ఒకే రోజు కళావాహన నిర్వహించటం తొలిసారని రిటైర్డ్‌ అర్చకులు పేర్కొంటున్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా ఉపాలయాలు, ఆళ్వార్ల గుడులను తొలగించాల్సి వస్తోంది. దీంతో మూలమూర్తులను తరలించేందుకు కళావాహన చేపట్టారు. జీర్ణోద్ధరణకు అర్చకులు మూలమూర్తుల వద్ద అనుజ్ఞ తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి త్రిదండి చిన జీయర్‌ స్వామి హాజరయ్యారు. అనంతరం భక్త రామదాసు, భద్రగిరి మహర్షి, శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు, ఇతర ఉపాలయాల్లో కళావాహన చేశారు.

60 మంది రుత్విక్కులతో..

యాదగిరి గుట్ట, ధర్మపురి, సింహాచలం ఇతర ఆలయాల నుంచి ప్రత్యేకంగా వచ్చిన 60 మంది రుత్వి క్కులు, ఆలయ అర్చకులు మేళతాళాల నడుమ పవిత్ర గోదావరి నుంచి పుణ్యజలాలను తీసుకొచ్చి యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. కళావాహన అనంతరం విగ్రహాలను కదిలించారు. శ్రీ లక్ష్మీతా యారు, గోదాదేవి అమ్మవార్లను ప్రధాన ఆలయ ముఖమండపం వద్ద భక్తుల దర్శనార్థం ఉంచుతామని, ఇతర మూర్తులను రంగనాయకుల గుట్టపై ధ్యానమందిరంలో నిర్మించిన తాత్కాలిక బాలాలయంలో కొలువుదీర్చుతామని ఆలయ అధికారులు తెలిపారు. కాగా, మధ్యాహ్నం వరకు స్వామివారి దర్శనం నిలిపివేయగా, సమాచారం తెలియని, దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వేచి చూశారు.

భక్త రామదాసుకు ప్రాధాన్యం

ప్రపంచ వ్యాప్తంగా ఆగమ శాస్త్రం ప్రకారం భద్రాచలం రామాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని త్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు. కళావాహన అనంతరం ఆలయ విలేకర్లతో మాట్లాడారు. రామ య్య స్వామి ఆలయం నిర్మించిన భక్త రామదాసుకు నూతన ఆలయ అభివృద్ధిలో కీలక ప్రాధాన్యం కల్పించాలని అన్నారు. ప్రధానాలయంలో రామయ్యకు ఒక వైపు శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు, మరో వైపు గోదాదేవి, లక్ష్మీతాయారు అమ్మవారికి ఎదురుగా భక్తరామదాసు విగ్రహంఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు వివరించారు. నిత్యం రామయ్యతో పాటు రామదాసుకు పూజలు జరగాలన్నారు. ఆలయ అభివృద్ధి అనంతరం ఉపాలయాలన్నీ ఒక వైపు, ఆళ్వార్లు మరో వైపు ఒకే చోట భక్తులకు దర్శనానికి ఉంటారని తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పూజల్లో పాల్గొని, ఈఓను అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ దామోదర్‌రావు దంపతులు, ఏఈఓలు శ్రవణ్‌కుమార్‌, భవాని రామకృష్ణ, ఉత్సవ కమి టీ బాధ్యులు కోటి శ్రీమన్నారాయణాచార్యులు, అమరవాది మురళీకృష్ణమాచార్యులు, ఆలయ రిటైర్డ్‌ ప్రధానాచార్యులు పొడిచేటి రామచంద్రాచార్యులు, పొడిచేటి సీతా రామానుజాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు విజయరాఘవన్‌, కోటి రామ స్వరూప్‌లు, స్థానా చార్యులు స్థలశాయి, వేదపండితులు గుది మళ్ల కృష్ణమాచార్యులు, ఇతర అర్చకులు, గాదె మాధవరెడ్డి, ఎండీ నవాబ్‌, రాజు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement