పనిమంతులు! | - | Sakshi
Sakshi News home page

పనిమంతులు!

Apr 27 2026 8:06 AM | Updated on Apr 27 2026 8:06 AM

ఉపాధి హామీ పనుల్లో

అతివలదే పైచేయి

వేసవి సెగల్లోనూ అలుపెరగకుండా పనులకు...

ఖమ్మం మయూరిసెంటర్‌: భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నా ఉపాధి హామీ పథకం పనులకు గ్రామీణులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజామునే పని ప్రదేశాలకు చేరుకుంటున్నారు. ఈక్రమంలోనే ఖమ్మం జిల్లాలో పనులకు వస్తున్న వారిలో మహిళల సంఖ్య అధికంగా ఉంటుండడం విశేషం. ఉపాధి పనుల్లోనూ తామే మేటి అని నిరూపిస్తున్న ఆడపడుచులు.. పురుషులకు దీటుగా చెమట చిందిస్తూ పనిదినాలను పూర్తి చేస్తున్నారు. జిల్లాకు నిర్దేశించిన భారీ లక్ష్యంతో పోలిస్తే క్షేత్రస్థాయిలో పనులకు వ్యత్యాసం ఉండడం.. వడగాల్పుల సెగలతో ఉపాధి లక్ష్యం కుదేలవుతున్న వేళ.. కేవలం మహిళా కూలీల శ్రమతో పథకం ముందుకు సాగుతోంది.

మహిళలే యాక్టివ్‌..

ఖమ్మం జిల్లాలో యాక్టివ్‌గా ఉన్న కూలీల్లో అత్యధికులు మహిళలే కావడం విశేషం. ప్రస్తుతం ఉన్న 2,70,821 మంది యాక్టివ్‌ కూలీల్లో 1,57,605 మంది మహిళలే కావడం వారి భాగస్వామ్యాన్ని చాటిచెబుతోంది. ఏప్రిల్‌ నెలలో ప్రభుత్వం నిర్దేశించిన 9.93 లక్షల పనిదినాల లక్ష్యాన్ని చేరుకోవడం ఉష్ణోగ్రతల కారణంగా గగనంగా మారింది. ఈనెల ముగియడానికి నాలుగు రోజులే ఉండగా.. ఇప్పటివరకు కేవలం 1.2394,011 పనిదినాలే పూర్తయ్యాయి. ఇందులో సింహభాగం అంటే 70 వేలకు పైగా పనిదినాలను మహిళా కూలీలే పూర్తి చేసి జిల్లా గౌరవాన్ని చాటుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఎండల ప్రభావంతో వెనుకబాటు

ప్రస్తుత వేసవిలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం ఉపాధి పనుల నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏప్రిల్‌ నెలకు సంబంధించి ప్రభుత్వం జిల్లాకు 9.93 లక్షలకు పైగా పనిదినాల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే భానుడి సెగలతో కూలీల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గతంలో ఏప్రిల్‌ నెలలో అత్యధిక పనిదినాలను పూర్తి చేసేవారు. కానీ ఈ ఏడాది ఏప్రిల్‌ నెల ముగిసేందుకు నాలుగు రోజుల గడువే ఉన్నా లక్ష్యంలో కనీసం సగం కూడా చేరకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 1,23,462 పనిదినాలే పూర్తికావడం ద్వారా కేవలం 10 – 11 శాతంగానే నమోదైంది.

పర్యవేక్షణతోనే లక్ష్య సాధన

ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వ లక్ష్యం మేర పనిదినాలు పూర్తి చేయాలంటే జిల్లా అధికారులు మొదలు క్షేత్ర స్థాయిలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శుల నిరంతర పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల కొరత, ఉపాధి హామీ పథకం సిబ్బందికి వేతనాల్లో జాప్యం తదితర కారణాలతో పర్యక్షణ కొరవడి పనులు మందకొడిగా సాగుతున్నాయని తెలుస్తోంది. ఇకనైనా అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో పనులపై కూలీలకు అవగాహన కల్పించడమే కాక పాటు క్షేత్ర స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తే లక్ష్యసాధన సులువు కానుంది.

చెమట చిందిస్తున్న

చైతన్యమూర్తులు

Advertisement
 
Advertisement
Advertisement