ఇదే సమయాన పెరుగుతున్న ధర
అయినా సమయానికి దరి చేరక
పడిపోతున్న సాగు విస్తీర్ణం
మూడేళ్లుగా పచ్చిరొట్ట విత్తనాల రాయితీల వివరాలు
రైతుకు భారం
ఖమ్మంవ్యవసాయం: సేంద్రియ పద్ధతిలో భూసారాన్ని పెంచేందుకు అవకాశం ఉన్న పచ్చిరొట్ట సాగుకు ప్రోత్సాహం కొరవడుతోంది. నాణ్యమైన పంటల ఉత్పత్తికి తోడ్పడే పచ్చిరొట్ట విత్తనాలకు ప్రభుత్వం ఏటేటా రాయితీలను తగ్గిస్తోంది. ఇదే సమాయన విత్తనాల ధరలు పెరుగుతుండడంతో పచ్చిరొట్ట సాగు రైతులకు భారంగా మారుతోంది. అంఏకాక తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా పచ్చిరొట్ట విత్తనాల పంపిణీకి నిధుల కేటాయింపు ఉన్నప్పటికీ కొంత మేరకు మాత్రమే రాయితీలకు వినియోగిస్తున్నారు. మరోపక్క సమయానికి విత్తనాలు అందుబాటులోకి రావడం లేదు. ఇలా రకరకాల కారణాలతో భూమికి మేలు చేస్తూ అధికోత్పత్తులకు దోహదపడే పచ్చిరొట్ట సాగు కూడా రైతుల నుంచి దూరమయ్యే పరిస్థితులు దాపురించాయి.
కర్బనం తక్కువగా...
తెలంగాణలోని భూముల్లో సేంద్రియ కర్బనం తక్కువగా ఉందని నిపుణులు గుర్తించారు. ఈనేపథ్యాన సేంద్రియ కర్బనం పెంచాల్సిన అవసరముందని నిపుణులతో పాటు, ప్రభుత్వం కూడా చెబుతోంది. పచ్చిరొట్ట సాగు చేసి భూమిలో కలియదున్నడం ద్వారా అంతరాలను సరిచేసే అవకాశం ఉంటుంది. కానీ ఐదేళ్లుగా పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ తగ్గడంతో దాదాపు రాష్ట్రమంతటా పచ్చిరొట్ట సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది.
రాయితీ తగ్గి..
ధరలు ౖపైపెకి..
పచ్చిరొట్ట విత్తనాలపై రాయితీ గడిచిన మూడేళ్ల కాలంలో 65 శాతం నుంచి 50 శాతానికి పడిపోయింది. ఐదేళ్ల క్రితం వివిధ రకాల పంటల విత్తనాలకు రాయితీలు ఎత్తివేసిన ప్రభుత్వం పచ్చిరొట్ట విత్తనాల విషయంలో అదే తీరు అవలంబిస్తోంది. జీలుగు, జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలకు 2023లో 65 శాతం రాయితీ ఇవ్వగా, 2024లో 60 శాతానికి, 2025లో 50 శాతానికి కుదించారు. ఇదే సమయాన పచ్చిరొట్ట విత్తన ధరలు పెరుగుతున్నాయి. 2023లో 30 కిలోల జీలుగు విత్తన బ్యాగ్ రైతు వాటా రూ.842 ఉంటే 2025లో ఏకంగా రూ. 2,137కు పెరిగింది. జనుము 40 కిలోల బ్యాగ్ ధర రూ.1,225 నుంచి రూ. 2,510కు, పిల్లి పెసర 20 కిలోల విత్తనాల బ్యాగ్ ధర రూ. 703 నుంచి రూ.2,055కు పెరగడం గమనార్హం.
నిధులు వృథా
ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్‌లో 50 శాతమే పచ్చిరొట్ట విత్తనాల రాయితీలకు వినియోగిస్తున్నారు. గత ఏడాది ప్రభుత్వం రూ.130 కోట్లు కేటాయిస్తే.. విత్తనాల సబ్సిడీకి రూ.67 కోట్లను మాత్రమే తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ వినియోగించింది. ఫలితంగా మిగిలిన రూ.63 కోట్ల నిధులు వృథా అయ్యాయి.
సగానికి పడిపోయిన సాగు
ఐదేళ్ల కాలంలో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ క్రమంగా తగ్గుతుండగా, సాగు విస్తీర్ణం కూడా పడిపోతోంది. 2021లో రాష్ట్రంలో 1.75 లక్షల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేస్తే 14.45 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. ఇక 2022లో 1.66 లక్షల క్వింటాళ్లే పంపిణీ చేయగా 13.66 లక్షల ఎకరాల్లో, 2023లో 1.27 లక్షల క్వింటాళ్ల విత్తనాలతో 10.46 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. అలాగే, 2024లో 1.16 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేయగా 9.31 లక్షల ఎకరాల్లో, 2025లో 0.87 లక్షల క్వింటాళ్ల విత్తనాలే పంపిణీ చేయగా పచ్చిరొట్ట సాగు 7.05 లక్షల ఎకరాలకు పరిమితమైంది. అంటే 2021తో పోలిస్తే 2025కు వచ్చే సరికి పచ్చిరొట్ట సాగు విస్తీర్ణం రాష్ట్రంలో సగానికి పడిపోయింది. ఎరువుల లభ్యత లేని ఈ సమయంలోనైనా పచ్చిరొట్ట విత్తనాల రాయితీని పెంచి పంపిణీ చేస్తే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
ఈపాటికే రావాలి...
పచ్చిరొట్ట విత్తనాలు సమయానికి రైతులకు అందడం లేదు. తొలకరికి ముందుగానే మే మొదటి వారంలో విత్తనాలను అందుబాటులోకి తీసుకురా వాలి. కానీ ఈసారి కూడా ఆ పరిస్థితి కానరావడం లేదు. అకాల వర్షాలకు రైతులు దుక్కలు చేసుకొని భూసారాన్ని పెంచుకునేందుకు పచ్చిరొట్ట విత్తనాలు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, విత్తనాల లభ్యత లేక ఈ ఏడాది కూడా సాగుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పచ్చిరొట్ట విత్తనాలపై
తగ్గుతున్న రాయితీలు
సంవత్సరం రాయితీ శాతం రైతు వాటా (విత్తన బ్యాగ్‌కు.. రూ.ల్లో)
జీలుగు జనుము పిల్లిపెసర
2023 65 842 1,225 703
2024 60 1,116 1,448 1,084
2025 50 2,137 2,510 2,055


