ఉమ్మడి జిల్లాలో ఇటీవల నమోదైన మరణాలు
బయటకు రావొద్దు..
● ఉమ్మడి జిల్లాలో గరిష్టస్థాయిలో ఉష్ణోగ్రతల నమోదు ● పెరుగుతున్న వడదెబ్బ మరణాలు ● అయినా అవగాహన చర్యలు శూన్యం
చుంచుపల్లి: రాష్ట్రంలోని మిగతాప్రాంతాల్లో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో గరిష్టస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండకు తోడు వడగాలుల ప్రభావం ఉండడంతో నానాటికీ వడదెబ్బ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. గడిచిన వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో వృద్ధులు, రైతులు, పిల్లలు, ఉపాధి కూలీలు తట్టుకోలేకపోతున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో 44.1 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉదయం నుంచి రాత్రి ప్రభావం ఉంటుండడంతో తప్పనిసరి బయటకు వస్తున్న వారు వడదెబ్బ బారిన పడుతున్నారు.
అవగాహన.. అంతంతే
ఉమ్మడి జిల్లాలో గరిష్ట స్థాయిలో ఎండల నేపథ్యాన రోజువారీ పనుల కోసం బయటికి వెళ్లేవారు వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉంది. ఈక్రమాన అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినా... ఉమ్మడి జిల్లాలో అలాంటి చర్యలేవీ కనిపించడం లేదు. పట్టణాలు, గ్రామాల్లో విస్తృతంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడమే కాక ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే, వైద్యులతో సదస్సులు ఏర్పాటుచేసి ఎండ సమయాన తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వడదెబ్బకు గురైతే చికిత్సపై అవగాహన కల్పించాలి. ఇలాంటివి జరకపోవడం.. పలువురు వడదెబ్బ బారినపడి మృతి చెందుతుండడం కలిచివేస్తోంది.
విపత్తు నిధి కింద పరిహారం
వడదెబ్బతో మృతి చెందే వారి కుటుంబాలకు ప్రభుత్వం రాష్ట్ర విపత్తు సహాయనిధి కింద పరి హారం చెల్లిస్తోంది. ఈ పరిహారం గతంలో రూ.50వేలే ఉండగా.. ఆపద్బంధు పేరుతో రూ.4 లక్షలు పరిహారం చెల్లించనున్నట్లు గతేడాది ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా వడదెబ్బతో మృతి చెందితే స్థానిక వైద్యాధికారి ధ్రువీకరించాలి. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి పంచనామా నిర్వహిస్తారు. వడదెబ్బతో మృతి చెందినట్లు నిర్ధారణ కోసం తప్పనిసరిగా శవపరీక్ష నిర్వహించాలి. ఈ నివేదిక ఆధారంగా ఎఫ్‌ఆర్, మరణ ధ్రువపత్రం, పంచనామా నివేదికలను తహసీల్‌లో అందిస్తే వైద్యాధికారి, ఎస్‌ఎచ్‌ఓ, తహసీల్దార్లతో కూడిన కమిటీ ఆర్డీఓకు.. అక్కడి నుంచి కలెక్టర్ నివేదిక పంపించి పరిహారం మంజూరు చేస్తారు. అయితే ఈ పరిహారంపైనా చాలామందికి అవగహన లేకపోవడంతో దూరమవుతున్నారు.
అశ్వాపురం మండలం జగ్గారానికి చెందిన రైతు మాదినేని బాబు(57) ఆదివారం చేను వద్దకు వెళ్లగా వడదెబ్బతో మృతి చెందాడు.
చండ్రుగొండ మండలం గానుగపాడుకు చెందిన వ్యవసాయ కూలీ పణితి వెంకటేశ్వర్లు(57) ఈనెల 23న ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలి మృతి చెందాడు.
ఈనెల 22న వైరా మండలం గరికపాడుకు చెందిన సుంకర వెంకటేశ్వర్లు(75) ఉపాధి పనులకు వెళ్లి వస్తూ, కల్లూరు మండలం గోపాలకుంటకు చెందిన ఫఠాన్ అమీన్‌భీ(75) ఇంట్లోనే ఎండదెబ్బతో గురై మృతి చెందాడు. ఇదేరోజు గేదేలను మేపడానికి వెళ్లిన పినపాక మండలం పోతిరెడ్డిపల్లి వాసి వెంకటేశ్వర్లు(51) సైతం మృత్యువాత పడ్డాడు.
ఈనెల 20న కల్లూరు అంబేడ్కర్ నగర్‌కు చెందిన కూలీ పాలవలస రాజు(68), ఎర్రుపాలెం మండలం రాజుపాలేనికి చెందిన స్వర్ణ నర్సింహరావు(62) మృతి చెందారు.
ఈనెల 19న చింతకాని మండలం నాగిలిగొండకు చెందిన వ్యవసాయ కూలీ మీరా(42), దమ్మపేట మండలం వడ్లగూడెంకు చెందిన పల్లెపు వెంకటలక్ష్మి(60) వడదెబ్బతో మృత్యువాత పడింది.
ఈనెల 17న వైరా మండలం విప్పలమడకకు చెందిన మేడా లక్ష్మి(65), నాగులవంచకు చెందిన ఏ.ధనలక్ష్మి(40) ఎండ తీవ్రతతో అస్వస్తతకు గురై మృతి చెందారు.
ఈనెల 14న కొణిజర్ల మండలం తణికెళ్లకు చెందిన ముత్యాల సత్యవతి(55) మిర్చి ఏరేందుకు వెళ్లి వడదెబ్బ లక్షణాలతో తీవ్ర అస్వస్తతకు గురై ఇంటివద్ద కుప్పకూలి మృతి చెందింది.
ఎండల నేపథ్యాన 70 ఏళ్లు పైబడిన వారు, పిల్లలు ఉన్న వారు ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లోనే ఉండడం శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాక ప్రతిరోజు మూడు నుంచి ఐదు లీటర్ల నీరు తాగాలని, నీటిలో నిమ్మకాయ రసం, ఉప్పు లేదా పంచదార కలిపి తాగితే ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. తప్పనిసరై బయటకు వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకుని వడదెబ్బ నుంచి రక్షణ పొందాలని సూచిస్తున్నారు.


