బీటెక్‌ విద్యార్థినికి రూ.78వేల ఆర్థికసాయం | - | Sakshi
Sakshi News home page

బీటెక్‌ విద్యార్థినికి రూ.78వేల ఆర్థికసాయం

Apr 27 2026 8:06 AM | Updated on Apr 27 2026 8:06 AM

కల్లూరు: నిరుపేద విద్యార్థిని బీటెక్‌ చదువుతుండగా, ఆమె ఫీజు ఇతర అవసరాల కోసం స్ఫూర్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యాన ఆదివారం రూ.78 వేల ఆర్థికసాయం అందచేశారు. పాతికేళ్ల క్రితం కేరళ నుంచి వచ్చి కల్లూరు స్థిరపడిన గార్నెట్‌ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన భార్య నాగమణి ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుండగా కుమార్తె మోరియర్‌ డయానా బీటెక్‌ చదువుతుంది. ఆమె ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉండడంతో స్ఫూర్తి ప్రతినిధి వరకా రామారావును సంప్రదించగా ఎన్‌ఆర్‌ఐల చేయూతతో ఆయన రూ.78 వేలు అందజేశారు.

పోలీసుల దాతృత్వం

తల్లాడ: తల్లాడ మండలం మల్లారం గ్రామం నుంచి పోలీసు శాఖలో ఉన్న పలువురు దాతృత్వం చాటుకున్నారు. గ్రామానికి చెందిన షేక్‌ యాకుబ్‌ పాషాకు కాలు ఇటీవల రోడ్డు ప్రమాదంలో విరగగా కదల్లేని స్థితిలో ఉన్నాడు. ఆయన కుటుంబం పరిస్థితిని గమనించిన మల్లారం పోలీసులు ఆదివారం రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గాదెరంజిత్‌, కుంచం రాంప్రసాద్‌, దుగ్గి దేవర ముత్యాలరావు, పసుపులేటి ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

మూడు నెలల బియ్యం తరలింపులో ముందంజ

నేలకొండపల్లి: ప్రభుత్వం ఈసారి మూడు నెలల బియ్యాన్ని రేషన్‌షాపుల ద్వారా లబ్ధిదారుల పంపిణీ చేస్తోంది. ఈనేపథ్యాన షాప్‌లకు సకాలంలో బియ్యం చేర్చడంలో జిల్లాలోనే నేలకొండపల్లి మండల లెవల్‌ స్టాక్‌ పాయింట్‌ ఆదర్శంగా నిలిచింది. ఇక్కడి స్టాక్‌ పాయింట్‌ పరిధిలో కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ మండలాలు ఉండగా, 119 షాప్‌లకు 3,900 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేశారు. అనుకున్న సమయం కంటే ముందుగానే తరలించిన ఉద్యోగులు, హమాలీలను జిల్లా సివిల్‌ సప్లయీస్‌ అధికారులు అభినందించారు. ఈమేరకు ఆదివారం పాయింట్‌ ఇన్‌చార్జ్‌ గుగులోత్‌ లక్ష్మణ్‌ను సిబ్బంది సన్మానించారు.

ట్రాక్టర్‌ బోల్తా పడడంతో డ్రైవర్‌ మృతి

నేలకొండపల్లి: ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్తా పడగా డ్రైవర్‌ మృతి చెందిన ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. నేలకొండపల్లి మండలం చెరువుమాధారం గ్రామానికి చెందిన యడవల్లి నాగేశ్వరరావు(51) ఆదివారం ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ చేస్తూ వెళ్తున్నాడు. బుద్ధారం–చెరువుమాధారం రహదారిలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ అదుపు తప్పి పల్టీ కొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇందిరమ్మ ఇంటి కోసం తప్పుడు పత్రాలు

చింతకాని: తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి తమకు దక్కాల్సిన ఇందిరమ్మ ఇంటిని మరో మహిళ దక్కించుకుందని చింతకాని మండలం నాగిలికొండకు చెందిన పామర్తి లక్ష్మీతిరుపతమ్మ ఫిర్యాదు చేసింది. అదే గ్రామానికి చెందిన పామర్తి కళావతిపై ఆమె ఆదివారం పోలీసులకు ఫిర్యాదు అందజేసింది. దీంతో కళావతితో పాటు ఆనాటి గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్‌ తెలిపారు.

వేధింపుల కేసు నమోదు

మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన దాసరి సందీప్‌కుమార్‌, ఆయన తల్లిదండ్రులు సంపత్‌, భారతిపై పోలీసులు ఆదివారం వేధింపుల కేసు నమోదు చేశారు. సందీప్‌ భార్య సౌమ్యను ఆయనతో పాటు మామ సంపత్‌, అత్త భారతి వేధిస్తున్నట్లు బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement