ఏదీ ఆహ్లాదం..? | - | Sakshi
Sakshi News home page

ఏదీ ఆహ్లాదం..?

Apr 26 2026 2:27 AM | Updated on Apr 26 2026 2:27 AM

నిర్వహణ పట్టని పాలకవర్గాలు, అధికారులు

అధ్వానంగా మారిన క్రీడా పరికరాలు, వాకింగ్‌ ట్రాక్‌లు

నగరం, పట్టణ ప్రజలు సేద తీరేది ఎక్కడ?

కొత్తగూడెంఅర్బన్‌: పిల్లలకు గత శుక్రవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. సరదాగా సాయంత్రం పార్క్‌లకు వెళ్లి ఆడుకుందామంటే ఆట సామగ్రి, వాకింగ్‌ ట్రాక్‌ అన్నీ అధ్వానంగా మారాయి. కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఇల్లెందు, మణుగూరు, అశ్వారావుపేట మున్సిపాలిటీలలో ప్రధాన పార్కులతోపాటు మినీ పార్కుల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

శిథిలావస్థకు చేరి..

కొత్తగూడెం కార్పొరేషన్‌లో ప్రధానంగా సింగరేణి చిల్డ్రన్‌ పార్కు, రాజీవ్‌పార్కు ఉన్నాయి. మిగతావి మినీ పార్కులు. వీటితోపాటు డివిజన్లు, వార్డులలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనాలు కూడా చెత్తాచెదారంతో నిండిపోయాయి. సింగరేణి చిల్డ్రన్‌ పార్కులో ఆట సామగ్రి శిథిలావస్థకు చేరింది. కొత్తగా పార్కుకు తెచ్చిన క్రీడా సామగ్రి నెలలు గడిచినా ప్రారంభించకపోవడంతో దుమ్ముధూళితో నిండిపోతున్నాయి. పార్కులో ప్రమాదకరంగా గుంతలు ఏర్పడ్డాయి.

కొత్త పార్కులకు లేని మోక్షం

కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా రూపాంతరం చెందినా పాలకవర్గం, అధికారులకు కొత్త పార్కుల ఏర్పాటు యోచనే లేదు. గతంలో రైల్వే అండర్‌ బ్రిడ్జిపైన ఉన్న స్థలంలో పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేశారు. కానీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి. జిల్లా కేంద్రం, కార్పొరేషన్‌ నడిబొడ్డున పార్కు ఏర్పాటు చేస్తే నగరానికి మరింత ఆకర్షణ వస్తుందని, ప్రజలు సేదతీరడానికి అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.

చిట్టడవిని తలపిస్తున్న వనాలు

కార్పొరేషన్‌తోపాటు మున్సిపాలిటీల్లోని పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. అందులో వాకింగ్‌ ట్రాక్‌లు నిర్మించారు. నిర్వాహణ లేకపోవంతో పట్టణ ప్రకృతి వనాలు చిట్టడవులను తలపిస్తున్నాయి. వనాలకు గేటు లేకపోవడంతో రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. డివిజన్లు, వార్డుల్లో ఏర్పాటు చేసిన మినీ పార్కులు కూడా చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్నాయి. రాత్రి వేళల్లో కొందరు పార్కుల్లో మద్యం తాగుతున్నారు. దీనివల్ల చుట్టు పక్కల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా కార్పొరేషన్‌, మున్సిపల్‌ పాలకవర్గాలు, అధికారులు స్పందించి పార్కుల్లో ఆహ్లాదం పంచేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

శిథిలావస్థలో మున్సిపల్‌ పార్కులు

Advertisement
 
Advertisement
Advertisement