రామయ్యకు సువర్ణ తులసీ అర్చన | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

Apr 26 2026 2:27 AM | Updated on Apr 26 2026 2:27 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన పూజలు చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ పెరుగుతోంది.

దరఖాస్తుల ఆహ్వానం

చుంచుపల్లి: అశ్వారావుపేట, ఇల్లెందు సామాజిక ఆరోగ్య కేంద్రం, చర్ల ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిన ఎంబీబీఎస్‌ వైద్యులను నియమించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రవిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేతనం నెలకు రూ.50 వేలు చెల్లిస్తామని, అభ్యర్థులు ఈ నెల 29వ తేదీలోగా కలెక్టరేట్‌లోని జిల్లా ఆసుపత్రుల ప్రధాన కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. చర్లలో ల్యాబ్‌టెక్నీషియన్‌ పోస్టుకు, భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో రేడియాలజిస్ట్‌ పోస్టుకు కూడా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. రేడియాలజిస్ట్‌కు నెలకు రూ.2 లక్షల వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు.

రేపటి నుంచి ‘రైతు

ముంగిట్లో శాస్త్రవేత్తలు’

అశ్వారావుపేట: రైతులకు సలహాలు సూచనలు చేసేందుకు వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో సోమవారం నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం చేపట్టినట్లు కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ హేమంత్‌కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు 9 బృందాలుగా ఏర్పడి నాలుగు వారాల పాటు రైతుల వద్దకు వెళ్లి అవగాహనా కార్యక్రమాలు చేపడతారని పేర్కొన్నారు. 72 గ్రామాల్లో వ్యవసాయ, అనుబంధ అధికారులతో కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు.

నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి

ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పీఓ రాహుల్‌

భద్రాచలం: సమ్మర్‌ క్యాంపుల్లో విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ రాహుల్‌ అన్నారు. శనివారం భద్రాచలంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల గిరిజన విద్యార్థులకు చేపట్టిన సమ్మర్‌ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీఓ రాహుల్‌ మాట్లాడుతూ మే నెల 9వ తేదీ వరకు క్యాంపు కొనసాగుతోందని పేర్కొన్నారు. విద్యార్థులు సబ్జెక్ట్‌లతోపాటు యోగా, డ్యాన్స్‌, వివిధ క్రీడలు, పెయింటింగ్‌, కుట్లు, అల్లికలు, ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్‌, వ్యాసరచన పోటీలు తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ట్రైబల్‌ వెల్ఫేర్‌ డీడీ అశోక్‌ మాట్లాడుతూ ఐటీడీఏవ్యాప్తంగా 200 మందిని బాలబాలికలను ఎంపిక చేశామని, బాలికలకు బాలికల గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలో, బాలురకు వికాసం పాఠశాలలో సమ్మర్‌ క్యాంపులు ఏర్పాటు చేశామని వివరించారు. అనంతరం విద్యార్థులకు క్రీడా పరికరాలు అందజేశారు. అధికారులు రమేష్‌, అలివేలు మంగతాయారు, సుభద్ర, నాగరాజు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement