రేపటి నుంచి అందుబాటులోకి సెల్ఫ్ ఎన్యుమరేషన్
ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు
స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ల ద్వారా వివరాల నమోదు
మీడియా సమావేశంలో వెల్లడించిన కలెక్టర్ అంకిత్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జన గణనకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. అయితే ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్)ను ఈసారి కొత్తగా కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను కలెక్టర్ అంకిత్ శనివారం ఐడీఓసీలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
రేపటి నుంచి మొదలు
సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ కోసం https:// se. census. gov. in వెబ్‌సైట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 2026 ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఇందులో వివరాలు నమోదు చేయవచ్చు. ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు వెబ్‌సైట్ అందుబాటులో ఉంటుంది. సైట్‌ను ఉపయోగించి జన గణనలో అందివ్వాల్సిన వివరాలను స్వయంగా ఏ కుటుంబానికి ఆ కుటుంబం పొందు పరిచే వీలుంది. తదుపరి దశలో జన గణన చేసే అధీకృత వ్యక్తులు ఇంటికి వచ్చి, వెబ్‌సైట్‌లో పొందు పరిచిన వివరాలను సరి చూస్తారు. ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించడం ద్వారా జనగణన ప్రక్రియ వేగవంతంకావడంతోపాటు ప్రజల విలువైన సమయం ఆదా అవుతుంది. సెల్ఫ్ ఎన్యుమరేషన్‌కు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రభుత్వం హామీ ఇస్తోంది.
నాలుగు అంచెల్లో..
ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ద్వారా ప్రభుత్వం సూచించిన వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. ముందుగా మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏ రాష్ట్రం, ఏ జిల్లా, ఏ ప్రాంతం, అడ్రస్ తదితర వివరాలు నమోదు చేయాలి. ఇదే సమయంలో కచ్చితమైన ఇంటి అడ్రెస్‌ను సైతం గూగుల్ మ్యాప్స్ ద్వారా పొందు పరిచే అవకాశం ఉంది. మూడో దశలో 31 రకాల ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మీరు ఎలాంటి ఇంటిలో ఉంటున్నారు. అంది సొంతమా? అద్దె ఇల్లా? ఇంట్లో ఎన్ని వాహనాలు ఉన్నాయి. కులం, వృత్తి ఇలాంటి సమాచారం అందివ్వాలి. ఇందులో 7వ, 9వ ప్రశ్నలు తప్ప మిగిలిన వాటికి సంబంధించిన వివరాలు నమోదు చేయవచ్చు. ప్రక్రియ పూర్తయ్యాక 11 అంకెల కోడ్‌తో ఐడీ (ఐడెంటిఫికేషన్ నంబర్) జనరేట్ అవుతుంది. జన గణనకు సంబంధించిన అధికారులు వ్యక్తిగతంగా ఇంటికి వచ్చినప్పుడు 11 అంకెల ఐడీ నంబర్‌ను చెబితే సరిపోతుంది. దాని ఆధారంగా మరోసారి ఆ ఇంటికి, ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలను వెరిఫై చేసుకుని, చివరగా ప్రభుత్వానికి ఆ సమాచారాన్ని అందజేస్తారు.
మొబైల్ నంబర్ ద్వారా రిజిస్టేషన్..
సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియలో ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది. అదే విధంగా కుటుంబ యజమాని పేరును మార్చే వీలు లేదు. వీటిని దృష్టిలో ఉంచుకుని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ మీడియా సమావేశంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యా చందన, సీపీఓ సంజీవరావు పాల్గొన్నారు.


