సూపర్‌బజార్(కొత్తగూడెం): ఆస్పిరేషనల్ జిల్లా, బ్లాక్‌లలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై శనివారం కలెక్టరేట్‌లో సమీక్ష జరిపారు. మినిస్టరీ ఆఫ్ పవర్ అడిషనల్ సెక్రెటరీ డాక్టర్ సాయిబాబు అధ్యక్షతన కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ అంకిత్, జిల్లా నోడల్ అధికారి లోకేష్, సీపీఓ సంజీవరావులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ శాఖలు చేపడుతున్న కార్యక్రమాల అమలు, పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీ చర్యలను పరిశీలించారు. ఆరోగ్య సేవలు, అంగన్‌వాడీ, విద్య, వ్యవసాయ,విద్యుత్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయిబాబు మాట్లాడుతూ ఆస్పిరేషనల్ జిల్లాలకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని తెలిపారు. మొదటి స్థానంలో నిలిచిన జిల్లాకు రూ.10 కోట్లు, రెండో స్థానానికి రూ.5 కోట్లు, వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన జిల్లాలకు రూ.3 కోట్లు చొప్పున మొత్తం రూ 30 కోట్ల వరకు ప్రోత్సాహక నిధులు అందజేయనున్నట్లు చెప్పారు. ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మండలాలకు రూ.20 కోట్ల ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ అభివృద్ధి సూచికల్లో రాష్ట్ర స్థాయిలో ముందంజలో నిలిచేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, పంచాయతీరాజ్ శాఖ ఈఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, ఆస్పిరేషన్ బ్లాక్ ఫెలో నవనీత్ పాల్గొన్నారు.
వైద్య సేవలు చేరువకావాలి
గుండాల: మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన గుండాలలో ప్రజలకు వైద్య సేవలు అత్యంత చేరువకావాలని కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ సాయిబాబా అన్నారు. ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా ఆయన మండలంలో కేజీబీవీ, అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. వైద్య సేవలపై ఆరా తీశారు. మలేరియా టెస్టుల వివరాలను అడిగితెలుసుకున్నారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని చెప్పారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంతోపాటు, కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఎంహెచ్‌ఓ తుకారం, సీపీఓ సంజీవరావు, ఎంపీడీవో బాలరాజు, తహసీల్దార్ కాసీం, ఎంఈఓ పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.


