కలెక్టర్‌కు టీయూడబ్ల్యూజే వినతిపత్రం
సూపర్‌బజార్(కొత్తగూడెం): అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులను అందజేయాలని, అక్రిడిటేషన్ కమిటీ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, డెస్క్ జర్నలిస్టులకు కూడా గతంలో మాదిరిగా అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని కోరుతూ కలెక్టర్ అంకిత్‌కు శనివారం టీయుడబ్ల్యూజే (143) ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు కళ్లోజి శ్రీనివాస్, టెంజూ అధ్యక్షులు వట్టికొండ రవి, స్టాఫ్ రిపోర్టర్లు కృష్ణగోవింద్, తాళ్లూరి రమేశ్, కాగితపు వెంకటేశ్వరరావు, యూనియన్ నాయకులు చావా పాపారావు తదితరులు పాల్గొన్నారు.
ఓఆర్‌ఎస్, తాగునీరు
అందుబాటులో ఉంచాలి
అశ్వాపురం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మండుటెండలకు రైతులు ఇబ్బందులు పడకుండా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్‌శ్రేష్ఠ ఆదేశించారు. మండలంలోని అశ్వాపురం, అమ్మగారిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన సందర్శించారు. ధాన్యం పరిశీలించి నిర్వాహకులు, రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోందని ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు సబ్‌కలెక్టర్‌కు సూచించారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తహసీల్దార్ సూర్యప్రకాష్, ఏఓ చటర్జి, ఆర్‌ఐ లీలావతి, పౌరసరఫరాలశాఖ డీటీ శివకుమార్ పాల్గొన్నారు.
భార్యను కత్తితో పొడిచిన భర్త..
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి..
చండ్రుగొండ: వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో భర్త కట్టుకున్న భార్యనే కత్తితో పొడిచాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం మృతిచెందింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని అయన్నపాలెం గ్రామానికి చెందిన బొప్పి నాగరాజు తన భార్య బొప్పి పున్నేశ్వరి (42)ని.. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఈ నెల 21వ తేదీన కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను తొలుత కొత్తగూడెం ఆస్పత్రికి.. అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలి సోదరి చాపలమడుగు చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివరామకృష్ణ తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు.
ఏకకాలంలో పోలీసుల నాకాబందీ
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో నాకాబందీ నిర్వహించారు. శనివారం రాత్రి 7.30 గంటల నుంచి 10 గంటల వరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ఎస్పీ రోహిత్ రాజు వివరాలు వెల్లడించారు. వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, పాత నేరస్తులను గుర్తించేందుకు ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీలు చేపట్టామని వివరించారు. జిల్లాలోని ఐదు సబ్ డివిజన్ల డీఎస్పీల ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లతో పాటు గ్రామాలలో కూడా నాకాబందీని నిర్వహించినట్లు తెలిపారు.
విద్యుదాఘాతంతో
వృద్ధుడి మృతి
పాల్వంచరూరల్: ఇంట్లో కూలర్ స్విచ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఇల్లెందులపాడు తండాలో శనివారం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఇల్లెందులపాడు తండాకు చెందిన గుగులోతు ఉమ్లా(60) ఉపాధి హామీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చాడు. ఎండవేడి తీవ్రంగా ఉండటంతో ఇంట్లోని కూలర్ స్విచ్ వేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అపస్మారకస్థితిలో పడిపోగా కుటుంబ సభ్యులు గమనించి పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


