తాగునీటి సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్యలు పరిష్కరించాలి

Apr 26 2026 2:27 AM | Updated on Apr 26 2026 2:27 AM

కలెక్టర్‌ అంకిత్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): నాలుగు రోజుల్లో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. వేసవికాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని మండలాల్లో హెల్ప్‌లైన్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టరేట్‌ నుంచి శనివారం ఆన్‌లైన్‌ ద్వారా ఐటీడీఏ పీఓ రాహుల్‌, సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, మిషన్‌ భగీరథ, పబ్లిక్‌ హెల్త్‌ శాఖ అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మండల స్థాయిలో తాగునీటి సరఫరా పర్యవేక్షణ బాధ్యత ఎంపీడీఓలదేనని స్పష్టం చేశారు. మిషన్‌ భగీరథ అధికారులు, ఎంపీడీఓలు సమన్వయంతో పనిచేయాలన్నారు. తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీటి సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మండలం, గ్రామంలో బోరులు, చేతి పంపులు వంటి ప్రత్యామ్నాయ వనరులను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలనానరు. సమస్య తలెత్తిన 24 గంటల్లోపు పరిష్కరించాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్లు ప్రతీ వార్డులో ఉదయం నీటి సరఫరా సమయంలో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. పాల్వంచలో 55, చర్లలో 54, దుమ్ముగూడెంలో 55 ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు ఉన్నా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగమైన 99 రోజుల కార్యాచరణలో వాటిని ఎందుకు పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని హెచ్చరించారు.

పోస్టర్లు ఆవిష్కరణ

యువత సమగ్ర అభివృద్ధి, క్రీడా రంగ ప్రోత్సాహం లక్ష్యంగా యువజన సర్వీసులు, క్రీడల శాఖ రూపొందించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక పోస్టర్‌ను కలెక్టర్‌ అంకిత్‌ శనివారం ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, సీపీఓ సంజీవరావు, జిల్లా క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement