డీఎస్‌ఓ వాహనం అడ్డగింత
ధాన్యం కొనడం లేదని బూర్గంపాడులో అధికారుల నిర్బంధం
ఎర్రగుంటలో జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో
పురుగుమందు తాగేందుకు యత్నించిన ఓ కర్షకుడు
బూర్గంపాడు: అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించడమే కాకుండా కొనుగోళ్లలోనూ ఆలస్యం చేస్తోంది. కొన్న ఒకటి, రెండు లారీల ధాన్యాన్ని నాణ్యత లేదంటూ మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో రైతులు విసిగిపోయి శుక్రవారం బూర్గంపాడు మార్కెట్‌యార్డులో ఆందోళనకు దిగారు. అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మండుటెండల్లో నెలరోజులుగా పడిగాపులు పడుతున్నా ధాన్యం కొనకుండా సాకులు చెబుతున్నారని కోపోద్రిక్తులయ్యారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవటంతో వ్యవసాయ అధికారులను, పీఏసీఎస్ అధికారులను రైతువేదికలో నిర్బంధించారు. నాలుగురోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా ఇప్పటివరకు ఒక్క లారీ ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని రైతులు మండిపడ్డారు. ఆ లారీ కూడా మిల్లు వద్ద దిగుమతి చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరగంట తర్వాత తలుపులు తీసి అధికారులకు తమ దుస్థితిని వివరించారు. తూర్పారా పోసిన ధాన్యాన్ని మళ్లీ తుర్పారా పట్టించాలని, నాణ్యత పరిశీలించాలని నిబంధనలు పెట్టి ఇబ్బందులు పెట్టడం సరికాదని వాపోయారు. మిల్లుల దగ్గరకు వెళ్లిన లారీలలోని ధాన్యం దిగుమతి చేసుకోకుండా తరుగు పేరుతో బస్తాకు ఐదారు కిలోల కోత విధించడమేమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు, పీఏసీఎస్ అధికారులు మాట్లాడుతూ నాణ్యత పరిశీలనలో భాగంగానే కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని తెలిపారు.
పురుగుమందు తాగేందుకు ఓ రైతు యత్నం
ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. ఈ క్రమంలో ఓయువరైతు పురుగుల మందు తాగేందుకు యత్నించగా. పక్కనే ఉన్న రైతులు నిలువరించారు. గుంపెన సొసైటీ (పీఏసీఎస్) కొనుగోలు కేంద్రంలో విక్రయాలు సాగట్లేదని, తరుగు పేరిట క్వింటాకు 5 కేజీల కోత విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకో చేస్తున్న సమయంలో కట్టుగూడేనికి చెందిన రైతు పంకు భద్రయ్య పురుగు మందు తాగేందుకు యత్నిండంతో, ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పక్కనే ఉన్న రైతులు స్పందించి నిలువరించారు. డబ్బాలోని మందు కింద పారబోశారు. ఈక్రమంలో పోలీసులు మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు.
డీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్ మధ్యాహ్నం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వెళ్తుండగా, వాహనాన్ని అడ్డుకున్నారు. అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. ఎస్సై విజయసింహా రెడ్డి రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా రైతులు శాంతించలేదు. ఈ సందర్భంగా డీఎస్‌ఓ మాట్లాడుతూ ఎగుమతి చేసిన నాలుగు లారీల ధాన్యంలో నాణ్యత లేకపోవడంతో మిల్లర్లు దిగుమతి చేసుకోలేదన్నారు. తూర్పారబట్టే మిషన్ల సక్రమంగా పనిచేయలేదని, వాటి స్థానంలో నూతనంగా మిషన్లు ఏర్పాటు చేస్తామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తహసీల్దార్ స్వర్ణ, సీఈఓ కుంచారపు శ్రీనివాసరావు, సొసైటీ మాజీ చైర్మన్ బోయినపల్లి సుధాకర్‌రావు, రైతులు వేముల హరీష్, పోట్రు రాంబాబు, వెంకటేశ్వరరావు, లక్ష్మణరావు, కృష్ణారావు, సుఽధీర్, రవి తదితరులు ఉన్నారు.


