భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచాలంకరణలో దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. కాగా, ఆదివారం జరగనున్న కళావాహన కార్యక్రమానికి శనివారం అంకురార్పణ జరపనున్నారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈఓ రజనీకుమారి పాల్గొన్నారు.
భూ పంపిణీతోనే
కొనుగోలు శక్తి..
వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి వెంకట్
రుద్రంపూర్: భూ పంపిణీతోనే దేశంలోని ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ అన్నారు. కొత్తగూడెంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఉపాధికి గ్యారెంటీ ఉంటే, ఇప్పుడు నిరుద్యోగం గ్యారెంటీ అయిపోయిందని విమర్శించారు. మతానికి రిజర్వేషన్లకు ముడిపెట్టడం సరికాదని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి, తక్షణమే సమ్మెను విరమింపజేయాలని కోరారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పెంపునకు దోహదపడుతున్న ఇండియన్స్, చైనీస్‌ను ట్రంప్ అవమానిస్తూ మాట్లాడటం అవివేకమన్నారు. మోదీ, రేవంత్‌రెడ్డి పాలనకు వ్యతిరేకంగా మూడు నెలల పాటు క్విట్ ఇండియా, సేవ్ ఇండియా, సేవ్ అగ్రికల్చర్ సేవల్ లేబర్ నినాదంతో ఆందోళన చేపట్టనున్నామని తెలిపారు. గ్రామీణ ఉపాధి చట్టం పరిరక్షణకు మే 15న సేవ్ ఉపాధి పేరుతో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుర్రి ప్రసాద్, మచ్చా వెంకటేశ్వర్లు, రేపాక శ్రీనివాస్,అన్నవరపు కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ–పాస్‌తో పకడ్బందీ భద్రత
సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ
భద్రాచలంటౌన్: జిల్లాలో భారీ ఈవెంట్లు, పండుగల నిర్వహణకు ఏఐ ఆధారిత ఈ–పాస్ వ్యవస్థ కీలకంగా మారిందని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2026 శ్రీరామనవమి వేడుకల్లో అమలు చేసిన ఈ విధానం ద్వారా నిరోధిత జోన్లలో ప్రవేశ నియంత్రణ, భద్రతా పర్యవేక్షణను సమర్థవంతంగా నిర్వహించగలిగామని పేర్కొన్నారు. ఫొటో ఆధారిత డిజిటల్ పాస్‌ల వల్ల అనధికార ప్రవేశాలకు అడ్డుకట్ట పడిందని వివరించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, కేజీబీవీలకు ఐఐటీ, జేఈఈ, నీట్, క్లాట్ వంటి పోటీ పరీక్షల పుస్తకాలతో పాటు ప్రొజెక్టర్లు, సౌండ్ సిస్టమ్‌లను పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యార్థుల కోసం పాఠశాలల్లో వాటర్ ఫిల్టర్లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేశామని, కేజీబీవీలలో అనారోగ్యంతో ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేసినట్లు వివరించారు.


