ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌తో ఉచితంగా శిక్షణ జిల్లాలో మూడు పాఠశాలల్లో కేంద్రాలు ఏర్పాటు అందుబాటులోకి జేఈఈ, నీట్, క్లాట్ శిక్షణ
కరకగూడెం: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో విద్యార్థినులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తొలుత పదో తరగతి వరకు బోధించగా, క్రమంగా ఇంటర్మీడియట్ స్థాయికి ఉన్నతీకరించారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, కంప్యూటర్ సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దీనికితోడు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కేజీబీవీల్లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఐఓఈ) కేంద్రాలను ప్రారంభించింది. జిల్లాలో 14 కేజీబీవీలు ఉండగా, భద్రాచలం(జేఈఈ), పాల్వంచ (నీట్), చంద్రుగొండ(క్లాట్) ఐఓఈ కేంద్రాలుగా ఎంపిక చేశారు. వీటిలో 400 మంది విద్యార్థినులు శిక్షణ పొందుతున్నారు. ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ, బైపీసీ విద్యార్థినులకు నీట్‌తోపాటు క్లాట్ పరీక్షలకు నిపుణులైన అధ్యాపకులతో ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా కోచింగ్ తీసుకోలేకపోతున్న విద్యార్థినులకు మేలు జరుగుతోంది.
ఏఐ ఆధారిత బోధన..
భవిష్యత్ తెలంగాణ కార్యక్రమం పేరుతో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత బోధనను ప్రవేశపెట్టింది. దీనిపై అవగాహన కోసం జిల్లాలోని సీఆర్టీలు, పీజీ సీఆర్టీలకు ఇటీవల హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ సంస్థలో ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఐఓఈ కేంద్రాల్లో బోధించే అధ్యాపకులకు అధునాతన ల్యాప్‌టాప్‌లు అందజేశారు. వీటి ద్వారా ఆన్‌లైన్‌లో నిపుణుల పాఠాలను ప్రత్యక్షంగా వినే అవకాశం కలగడంతోపాటు, విద్యార్థినులు సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకునే అవకాశం ఉంది.
గ్రామీణ ప్రాంత విద్యార్థినులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అకడమిక్ చదువులతోపాటు అత్యున్నత స్థాయి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు జిల్లాలో మూడు ఐఓఈ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. జేఈఈ, నీట్, క్లాట్ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
–అన్నామణి, జీసీడీఓ


