సూపర్‌బజార్(కొత్తగూడెం): రైతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం శుభ్రపరిచి, కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సూచించారు. శుక్రవారం ఎర్రగుంటలో రైతులు ఆందోళన చేపట్టగా, ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఆరు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సుమారు 15 లారీల ధాన్యం వచ్చిందని తెలిపారు. పౌరసరఫరాల శాఖ అధికారుల పరిశీలనలో ధాన్యంలో తేమ శాతం అనుకూలంగా ఉన్నప్పటికీ, ధాన్యం పరిశుభ్రత లోపించడం గమనించినట్లు తెలిపారు. నాణ్యత ప్రమాణాలకు సరిపోకపోవడంతో కొనుగోలులో ఇబ్బందులు తలెత్తినట్లు వివరించారు. ఈ విషయమై వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించగా ధాన్యం శుభ్రపరిచే ప్రక్రియ సరిగా జరగలేదని వెల్లడించినట్లు చెప్పారు. వెంటనే ప్యాడీ క్లీనర్లను వినియోగించి ధాన్యాన్ని శుభ్రపరిచాక కొంత మెరుగైన ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ, కొందరు రైతులు శుభ్రపరచకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ధర్నాకు దారితీసిందన్నారు. ఈ విషయంపై తక్షణమే పౌరసరఫరాల శాఖ అధికారులు, సంబంధిత మేనేజర్లు రైతులతో చర్చించి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కొనుగోలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, కేంద్రాల ఇన్‌చార్జ్‌లకు ఇప్పటికే మార్గదర్శకాలు అందించినట్లు వెల్లడించారు.
రైతులకు అదనపు కలెక్టర్
వేణుగోపాల్ విజ్ఞప్తి


