భద్రాచలం: గిరిజన నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పథకాలపై దృష్టి సారించాలని, తద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని ఐటీడీఏ ప్రాజెక్టు అఽధికారి బి.రాహుల్ తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం గిరిజన నిరుద్యోగ యువతకు ఏర్పాటుచేసిన ఉచిత శిక్షణ, అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పోటీ ప్రపంచంలో వృత్తి నైపుణ్యాలు పెంచుకుంటే ప్రైవేట్ రంగంలో సైతం ఉపాధి అవకాశాలు లభించనున్నందున ఐటీడీఏ ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సదస్సుకు 170 మంది యువతీ, యువకులు హాజరుకాగా.. ఐటీ హెల్ప్‌డెస్క్ అటెండెంట్ కోర్సుకు 45 మంది, జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోర్సుకు ఎనిమిది మంది, ఎంబ్రాయిడరీ మిషన్ ఆపరేటర్ శిక్షణకు 20 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుకు 35 మంది, టైలరింగ్ శిక్షణకు 52 మంది ఆసక్తి చూపారని పీఓ తెలిపారు. వీరికి మూడు నుంచి ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వడమే కాక ఉచిత భోజన, వసతి కల్పిస్తామని వెల్లడించారు. ఈసమావేశంలో సర్పంచ్ పూనెం కృష్ణ, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అశోక్, ఏఓ సున్నం రాంబాబు, జేడీఎం హరికృష్ణ, వైటీసీ సెంటర్ ఇన్‌చార్జ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.


