నేరుగానే! | - | Sakshi
Sakshi News home page

నేరుగానే!

Apr 25 2026 7:30 AM | Updated on Apr 25 2026 7:30 AM

ఆశావహుల సందడి

పదవుల భర్తీలో

ఎమ్మెల్యేల ప్రతిపాదనలే కీలకం

డీసీసీబీ చైర్మన్‌, డైరెక్టర్ల పదవులకూ పెరగనున్న పోటీ

ఉమ్మడి జిల్లాలో 101 పీఏసీఎస్‌లు

ఎన్నిక లేదు..

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌) పాలకమండళ్ల భర్తీ ఇకపై నామినేటెడ్‌ విధానంలో జరగనుంది. సంఘాల పదవీకాలం ముగిసి చాన్నాళ్లు కాగా, ఇన్‌చార్జి అధికారుల పాలన కొనసాగుతోంది. ఈ దశలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోగా, పీఏసీఎస్‌ల చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లను ప్రభుత్వం నామినేటెడ్‌ పద్ధతిలో భర్తీ చేయనుంది. అయితే, ఎంపికలో ఎమ్మెల్యేల పాత్ర కీలకం కానుండడంతో కాంగ్రెస్‌లోని ఆశావహులు తమ వంతు ప్రయత్నాలను మొదలుపెట్టారు.

ఏడాదిగా ఇన్‌చార్జిల పాలనే..

ఖమ్మం డీసీసీబీ పరిధిలో ఉమ్మడి జిల్లాలో 101 పీఏసీఎస్‌లు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 76, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21తో పాటు మహబూబాబాద్‌ జిల్లాలో రెండు, ములుగు జిల్లాలో రెండు కొనసాగుతున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడంతో పాటు ఎరువులు, విత్తనాల అమ్మకం, పంట ఉత్పత్తుల భద్రతకు గోదాంల సదుపాయాలు కల్పిస్తాయి. అంతేకాక ధాన్యం కొనుగోలు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నాయి. అయితే, పీఏసీఎస్‌ల పాలక మండళ్ల పదవీకాలం గత ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది. అప్పటి నుంచి ఇన్‌చార్జి అధికారుల పర్యవేక్షణలోనే సంఘాలు కొనసాగుతున్నాయి.

పీఏసీఎస్‌ టూ డీసీసీబీ...

ఇప్పటి వరకు పీఏసీఎస్‌ల పాలకమండళ్లు ఎన్నికల ప్రక్రియ ద్వారా కొలువుదీరాయి. సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులు తమ ఓటు ద్వారా 10 – 12 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. వీరు పీఏసీఎస్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లను.. ఆపై చైర్మన్లు డీసీసీబీ డైరెక్టర్లను, వారు డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకునే విధానం కొనసాగుతోంది. దీంతో గ్రామంలో ఉన్న రైతు నుంచి జిల్లా కేంద్రంలో ఉన్న డీసీసీబీ వరకు అనుబంధం ఉండి.. రుణాలు, ఎరువులు, విత్తనాల కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగేది.

నామినేటెడ్‌కు ‘జై’

ఇకపై పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్‌ పద్ధతిలో పదవులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమాన డైరెక్టర్లు, చైర్మన్‌, వైస్‌ చైర్మన్లనే కాక.. డీసీసీబీ, డీసీఎంఎస్‌లో ఇదే తరహాలో పాలక మండళ్లను నియమించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఎమ్మెల్యేల ప్రతిపాదనలు కీలకం కానున్నాయి. జిల్లా మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులు కూడా ఇందులో భాగం కానున్నారు. మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నాక పోస్టుల భర్తీ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమాన అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పదవుల భర్తీపై కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది.

ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ నాయకులు పలువురు నామినేటెడ్‌ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ తమకు పదవులు దక్కుతాయో, లేదోనన్న ఆందోళన వారిలో పెరిగిపోతోంది. ఈక్రమాన పీఏసీఎస్‌ల రూపంలో కొన్ని పదవులైనా భర్తీ చేయొచ్చనే భావనకు ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తుండగా.. ఆశావహుల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్‌ చైర్మన్ల రూపంలోనే 101 మందికి.. ఒక్క ఖమ్మం జిల్లాలో 76 మందికి అవకాశం దక్కనుంది. మే నెలాఖరుకల్లా నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా నిరాశతో ఉన్న పార్టీ శ్రేణులను సంతృప్తిపరిచినట్లు అవుతుందనే భావనలో ఉన్నట్లు సమాచారం. ఏదీఏమైనా ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో రాజకీయ వేడి మొదలుకాగా.. ఏదో ఒక పదవి దక్కించుకోవాలనే ఉద్దేశంతో నాయకుల నుంచి కార్యకర్తల వరకు స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులను కలిసేలా రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

పీఏసీఎస్‌లకు నామినేటెడ్‌ పద్ధతిలో పాలకమండళ్లు

Advertisement
 
Advertisement
Advertisement