ఇంటర్ ప్రవేశపరీక్షకు నేడు
ముగియనున్న దరఖాస్తు గడువు
చదువుతో పాటు క్రీడా,
తదితర రంగాల్లో తర్ఫీదు
సద్వినియోగం చేసుకోవాలి
నేలకొండపల్లి: సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల జూనియర్ కాలేజీలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలుస్తున్నాయి. పాఠ్యాంశాల బోధనే కాక జేఈఈ, నీట్, ఎప్‌సెట్‌కు ప్రత్యేక శిక్షణ ఇస్తుండడంతో విద్యార్థినులు అటు ఇంటర్‌లో, ఇటు పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటుతున్నారు. ఈమేరకు గురుకులాల్లో 2026–28 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆధునాతన తరగతి గదులు, విశాలమైన మైదానాలతో పాటు నిష్టాతులైన అధ్యాపకులు ఉన్నందున కాలేజీల్లో చేరాలని అధ్యాపకులు విస్తృత ప్రచారం చేస్తున్నారు.
బాలురకు మూడు, బాలికలకు పది
ఖమ్మం జిల్లాలో 13 సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కాలేజీలు ఉన్నాయి. ఇందులో మూడు బాలుర కాలేజీలు కాగా, పది బాలికలకు 10 కాలేజీలు కొనసాగుతున్నాయి. ఒక్కో కాలేజీలో గ్రూప్‌కు రెండు సెక్షన్ల చొప్పున 80 మందికి ప్రవేశాలు కల్పించే అవకాశముంది. మొత్తంగా జిల్లాలోని అన్ని గురుకులాల్లో 1,040 సీట్లు ఉండగా, పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. కాగా, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించే గడువు శనివా రంతో ముగియనుంది. 2025–26లో పదో తరగతి చదివిన విద్యార్థులనే అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటారు.
విద్యతోపాటు క్రీడల్లో ప్రోత్సాహం
గురుకుల కాలేజీల్లో నాణ్యమైన విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నారు. విశాలమైన మైదానాలు ఉండడంతో ఉదయం, సాయంత్రం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. కాలేజీల విద్యార్థులు పలువురు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో రాణించారు. నేలకొండపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కాలేజీ విద్యార్థినులు చదువుతో పాటు క్రీడాపోటీల్లో సత్తా చాటారు. అంతేకాక ప్రాక్టికల్స్ కోసం అన్ని పరికరాలతో కూడిన ల్యాబ్‌లు, కంప్యూటర్ బోధనకు సైతం ఆధునిక కంప్యూటర్లు ఉన్నందున ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధ్యాపకులు సూచిస్తున్నారు.
సాంఘిక సంక్షేమ శాఖ పరిధి లోని గురుకుల కాలేజీల్లో నాణ్యమైన విద్య అందుతుంది. ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నా రు. అంతేకాక ప్రాక్టికల్స్, కంప్యూటర్ బోధనకు అత్యాధునిక ల్యాబ్‌లు ఉన్నా యి. ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి. – జి.శ్రీలత,
ప్రిన్సిపాల్, గురుకుల కాలేజీ, నేలకొండపల్లి


