బూర్గంపాడు: సారపాక గ్రామపంచాయతీలోని సుందరయ్యనగర్‌కు సమీపంలో ఓ జామాయిల్ తోటలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై శుక్రవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ సీఐ రమాకాంత్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన పోలీసులు 11మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. రూ 57,950 నగదు, 13 సెల్‌ఫోన్లు, రెండు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న పేకాటరాయుళ్లను బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, మరో ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. ఈ దాడులలో టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ సుమన్, బూర్గంపాడు అడిషనల్ ఎస్‌ఐ నాగభిక్షం పాల్గొన్నారు.
జేసీబీ సీజ్
అశ్వాపురం: మండల పరిధిలోని అమ్మగారిపల్లి గ్రామంలో గోదావరి నుంచి అక్రమంగా ఇసుక తరలించేందుకు గోదావరిలో రోడ్డు చేస్తున్న జేసీబీని సీఐ అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. జేసీబీ డ్రైవర్ ముంతాజ్, యజమాని అనంతనేని సురేష్‌పై పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జేసీబీని సీజ్ చేశారు.
ఇసుక లారీ..
బూర్గంపాడు: ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న లారీని గురువారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. మండల పరిధిలోని మోతె పట్టీనగర్ వద్ద నుంచి ఇసుక తరలిస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించి బాధ్యులపై కేసు నమోదు చేశారు.
మణుగూరు బార్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం
మణుగూరు టౌన్: 2026 సంవత్సరానికి మణుగూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గురుకృష్ణ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. కోర్టు ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెజిస్ట్రేట్ కంబపుసూరి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బార్, బెంచ్ మధ్య సుహృద్భావ సంబంధాలు కొనసాగాలని సూచించారు. జూనియర్, సీనియర్ న్యాయ వాదులు ఐక్యంగా పనిచేసి, కోర్టు గౌరవాన్ని మరింత పెంచాలని సూచించారు.
వైన్‌షాపు
నిర్వాహకుడిపై దాడి
పాల్వంచరూరల్: బీరు కొనుగోలు చేసిన వ్యక్తి గ్లాస్ అడిగితే ఇవ్వకపోవడంతో వైన్‌షాపు నిర్వాహకునిపై దాడి చేసిన ఘటన శుక్రవారం జరిగింది. మండల పరిధిలోని పెద్దమ్మగుడి వద్ద గల వైన్‌షాపులో జగన్నాథపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ దుర్గాప్రసాద్ బీరు కొనుగోలు చేశాడు. బీరు తాగేందుకు వైన్‌షాపు కౌంటర్‌లో ఉన్న గద్దె రమేష్‌ను గ్లాస్ అడగగా, ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో ఆవేశంతో దుర్గాప్రసాద్ వైన్‌షాపు కౌంటర్‌లో ఉన్న రమేష్‌పై దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో దాడిచేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బి.సురేశ్ తెలిపారు.


