రుద్రంపూర్: కార్పొరేట్ సంస్థల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోందని ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ విమర్శించారు. కొత్తగూడెంలోని సామినేని రామారావునగర్, కాసాని ఐలయ్య ప్రాంగణంలో నిర్వహిస్తున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాతో మోదీ ప్రభుత్వం చేసుకున్న సామ్రాజ్యవాద అనుకూల ఒప్పందాలు భారతదేశంలో ఉత్పత్తి దారులు, రైతులకు తీవ్రనష్టమని అన్నారు. ఐక్య పోరాటాలతో ఈ ఒడంబడికలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ట్రంప్ ఏకపక్షంగా ఒడంబడిక ప్రకటించిన వెంటనే నరేంద్రమోదీ విజయం సాధించినట్లు పేర్కొనడం విడ్డూరమన్నారు. మనదేశ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతిచేస్తే 18 శాతం పన్ను వేస్తుండగా, అమెరికా ఉత్పత్తులు పన్ను లేకుండా పాలకులు దిగుమతి చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆ దేశంలో ఏటా ఒక్కో రైతుకు రూ.20 లక్షలకు సబ్సిడీ ఇస్తుండగా, ఇక్కడ సగటున రూ.34 వేలు మాత్రమే వస్తున్నట్లు వివరించారు. విదేశీ ఒప్పందాలతో భారతీయ రైతులకు తీరని నష్టమని తెలిపారు. జయశంకర్ వ్యవసాయ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య మాట్లాడుతూ పంటమార్పిడి ఉద్యమంలా సాగాలని సూచించారు. రైతుల మేలు కోసం ప్రభుత్వా మెరుగైన విధానాలు తీసుకురావా లని అన్నారు. కుటుంబ ఆదాయం, ఖర్చుల మధ్య భారీ వ్యత్యాసాల వల్ల రైతులు క్రమంగా సంక్షోభంలోకి కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి పోవాలని ఆకాంక్షించారు. సభలో సీనియర్‌నేత సారంపల్లి మల్లారెడ్డి, ప్రొఫెసర్ ఆరుబండి ప్రసాదరావు, నాయకులు టి. సాగర్, జంగారెడ్డి, కందాల ప్రమీల, శోభనా నాయక్, మచ్చా వెంకటేశ్వర్లు, నున్నా నాగేశ్వరరావు, ఎ. కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి
విజ్జూకృష్ణన్


