ఇందుకోసం కొత్తగా లెగసీ అండ్ థ్రస్ట్ టెరిటరీస్ ఏర్పాటు చేసిన కేంద్రం
జాబితాలో తెలంగాణ నుంచి భద్రాద్రితోపాటు ములుగు జిల్లా
మావోయిస్టులు లేరు
దేశంలో మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపు అంతరించిపోయినా మరికొన్నాళ్లు యాంటీ నక్సల్స్ యాక్షన్ ప్లాన్ కొనసాగిస్తామని కేంద్రం ప్రకటించింది. ఏయే జిల్లాల్లో ప్లాన్ అమల్లో ఉంటుందనే వివరాలను సైతం వెల్లడించింది. ఈ జాబితాలో జిల్లాతోపాటు పొరుగునే ఉన్న ములుగు, ఏపీలోని అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలు కూడా ఉన్నాయి.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
జాబితాలో స్థానం
మావోయిస్టుల ప్రభావం ప్రస్తుతానికి తగ్గిపోయినా.. తిరిగి పుంజుకోకుండా, మళ్లీ సాయుధ పోరాట పంథా అనుసరించకుండా మరికొన్నాళ్లు లా అండ్ ఆర్డర్ పరంగా చర్యలు తీసుకునే ప్రాంతాలను లెగసీ అండ్ థ్రస్ట్ టెరిటరీ కేటగిరీలో చేర్చారు. ఇందులో తెలంగాణ నుంచి భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ములుగు జిల్లా కూడా ఉంది. గతంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాగా ఉన్న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను జాబితా నుంచి తప్పించారు. ములుగు, భద్రాద్రి జిల్లాలకు సరిహద్దుగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఉంటుంది. ఈ మూడు జిల్లాల సరిహద్దులో కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. తెలంగాణ సరిహద్దులో ఉన్న ఏపీలోని అల్లూరి సీతారామారాజు, పోలవరం జిల్లాలకు సైతం ఇదే జాబితాలో చోటు కల్పించింది.
యాక్షన్ ప్లాన్–2015 కొనసాగింపు
వామపక్ష తీవ్రవాద ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్ – 2015 పేరిట కేంద్రం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత జిల్లాలను గుర్తించగా.. ఆయా జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయించింది. భద్రతా కోణంలో నూతన రహదారులు, వంతెనలకు నిధులు మంజూరు చేసింది. దీంతోపాటు నక్సల్స్ ఆపరేషన్స్ కోసం ప్రత్యేక బడ్జెట్ అందుబాటులో ఉంచింది. ఈ నిధులతో పోలీస్‌శాఖ సరెండర్లను ప్రోత్సహించడతోపాటు నక్సల్స్ ప్రభావిత జిల్లాలో యువతకు క్రీడామైదానాలు, ఉపాధి అవకాశాలను కల్పించే పనులు చేపట్టింది. మావోయిస్టుల కార్యకలాపాలపై నిఘా వేసేందుకు ప్రత్యేక నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుంది. నక్సల్స్ విముక్త్ భారత్ అని ప్రకటించడంతో ఈ నిధులన్నీ ఆగిపోతాయనే సందేహాలు నెలకొన్నాయి. అయితే, నక్సల్స్ ప్రభావిత జిల్లాలు లేవని కేంద్రం ప్రకటించినా లెగసీ అండ్ థ్రస్ట్ టెరిటరీస్ పేరుతో కొత్త కేటగిరీ పెట్టింది. దీంతో జాబితాలో ఉన్న తెలంగాణలోని రెండు జిల్లాల్లో యాక్షన్ ప్లాన్–2015 అమలు కొనసాగనుంది.
తగ్గుముఖం ఇలా
మావోయిస్టు పార్టీ ఏర్పాటైనప్పుడు పదహారు రాష్ట్రాల్లో 156 జిల్లాలు మావోయిస్టు ప్రభావిత జిల్లాలుగా ఉండేవి. 2018 నాటికి ఈ సంఖ్య 126కి పడిపోయింది. ఆ తర్వాత వరుసగా 2021లో 90 జిల్లాలకు 2024 నాటికి 38 జిల్లాలకు చేరింది. ఆపరేషన్ కగార్‌తో ఆ 38 జిల్లాల్లో కేవలం రెండు జిల్లాలో నామ్ కే వాస్తేగా ఆ పార్టీ మిగిలింది.
మావోయిస్టు కార్యకలాపాలు అంతమైనా మరికొన్నాళ్లు యాక్షన్ ప్లాన్
సాయుధ పోరాట పంథాను అనుసరించే సీపీఐ(మావోయిస్టు) పార్టీ అనేది ముగిసిన అధ్యాయమని కేంద్రం హోంమంత్రి అమిత్‌షా మార్చి 27న పార్లమెంట్‌లో ప్రకటించారు. తమ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమంతోపాటు హింసాయుత పద్ధతులపై ఉక్కుపాదం మోపడంతో మావోయిస్టులు దేశంలో అంతరించిపోయారని పేర్కొన్నారు. ఆ తర్వాత తాజా పరిస్థితిపై కేంద్రం వివరాలు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా అత్యంత మావోయిస్టు ప్రభావిత జిల్లాలనేవి లేవని తెలిపింది. మావోయిస్టు ప్రభావిత జిల్లాల కేటగిరీలో కేవలం బీజాపూర్(ఛత్తీస్‌గఢ్), వెస్ట్ సింగ్‌భూమ్ (జార్ఖండ్) మాత్రమే ఉన్నట్టు పేర్కొంది. గతేడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 38 జిల్లాలు మావోయిస్టు ప్రభావిత జిల్లాల కేటగిరీలో ఉండేవి. ఇందులో బీజాపూర్, వెస్ట్ సింభూమ్ జిల్లాలను మినహాయిస్తే మిగిలిన 36 జిల్లాలను లెగసీ అండ్ థ్రస్ట్ టెరిటరీస్(ఎల్‌టీటీ) పేరుతో ఏర్పాటు చేసిన నూతన కేటగిరీలో చేర్చారు.


