భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో గురువారం మాలధారులు శ్రీరామ పునర్వసు దీక్ష విరమించారు. భద్రగిరి మాఢ వీధులు మాలధారుల శ్రీరామనామస్మరణతో మార్మోగాయి. తొలుత ఆలయ ఏఈఓ శ్రావణ్ కుమార్ శ్రీరామ పాదుకలను శిరస్సుపై ధరించారు. రామపాదుకలతో ఊరేగింపుగా మంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణ జరిపారు. శ్రీరామదాసు విగ్రహానికి పూలమాలలను అలంకరించారు. అనంతరం బేడా మండపంలో శ్రీరామ దీక్షా విరమణ పూజలు, సంక్షిప్త రామాయణ హవనం జరిపారు. ఉపాలయంలో మాలధారణ విరమించాక యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి వేళ స్వామివారికి రథసేవ నిర్వహించారు. బేడా మండపంలో శ్రీ సీతారాముల నిత్యకల్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఎస్పీ రోహిత్ రాజు, ఈఓ దామోదర్‌రావు ఆలయ అర్చకులు, పండితులు రామదాసు వారసులు కంచర్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు జరిపారు. ఆలయ ఈఓ రజనీకుమారి, అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే
చర్యలు తప్పవు
కలెక్టర్ అంకిత్ హెచ్చరిక
కరకగూడెం/పినపాక: ప్రభుత్వ అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. గురువారం పినపాక, కరకగూడెం మండలాల్లో పర్యటించిన ఆయన ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత పినపాక మండలంలోని ఈ.బయ్యారం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ పౌరసరఫరాల శాఖ డీటీ శివ కుమార్ అందుబాటులో లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోపాలరావు పేటలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలించి, నాణ్యత పాటించాలని ఆదేశించారు. అనంతరం కరకగూడెం, భట్టుపల్లి, ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారురు. సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, మైనింగ్ ఏడీ దినేష్ కుమార్, ఏడీఏ తాతారావు, తహసీల్దార్ వట్టం కాంతయ్య, ఎంపీడీఓలు వెంకటేశ్వరరావు, కుమార్, ఎంఈఓలు నాగయ్య, మంజుల, ఏఓలు చటర్జీ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
జాతీస్థాయిలో రెండోస్థానం
బీచ్‌వాలీబాల్ పోటీల్లో రాణించిన
రాష్ట్ర జట్టు
పాల్వంచరూరల్: గోవా రాష్ట్రంలోని పనాజీలో జరుగుతున్న జాతీయస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలు గురువారం రాత్రి ముగిశాయి. తెలంగాణ జట్టు సెమీఫైనల్స్‌ల్లో గుజరాత్ జట్టును ఓడించి ఫైనల్‌కు చేరింది. ఫైనల్ మ్యాచ్‌లో తమిళనాడు జట్టుతో తలపడి పోరాడి ఓడింది. జాతీయస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. జట్టులో క్రీడాకారులు జి.విష్ణువర్ధన్(పాల్వంచ జూనియర్ కళాశాల), రిషి వర్మ (కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్), కార్తీక్ (సిద్దిపేట) రాణించినట్లు కోచ్ వెంకటరమణ తెలిపారు.


