ప్రాకారాల ఏర్పాటుకు మార్కింగ్
● ప్రధాన ఆలయానికి నాలుగువైపులా నిర్మాణం ● మార్కింగ్ చేసిన ఆర్‌అండ్‌బీ, ఆర్కిటెక్ట్‌ల బృందం ● 26న కళావాహన పూజలతో మూర్తుల తరలింపు ● భద్రాచలం రామాలయ అభివృద్ధి పనులు వేగవంతం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అభివృద్ధి పనులకు అధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు ఆర్కిటెక్ట్ బృందంతో కలిసి మార్కింగ్ ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లను ప్రకటించి, వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల నాటికి మొదటి విడత పనులు పూర్తిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీంతో తొలి విడతలోనే రూ.180 కోట్లతో ప్రధాన ఆలయం అభివృద్ధి పనులు చేపట్టారు. పనులు ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించటంతో ఆర్కిటెక్ట్ బృందంతో కలిసి ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ప్రాకారాలు, గోపురాల నిర్మాణం ఇలా..
దక్షిణం వైపు ప్రస్తుతం చిత్రకూట మండపం ఉన్న స్థలంలో సగంలోపు మొదటి ప్రాకార గోపురం, జీఎంఆర్ సంస్థ ఏర్పాటు చేసిన పైకప్పు వరకు రెండో ప్రాకార గోపురం నిర్మించనున్నారు. తూర్పు వైపు ప్రస్తుతం ఉన్న మొదటి ప్రాకార గోపురం కాకుండా రెండో ప్రాకార గోపురం ఆంజనేయ స్వామి ఉపాలయం అవతల నుంచి రానుంది. పడమర వైపు ప్రస్తుతం ఉన్న ప్రాకార గోపురం కాకుండా రెండోది లడ్డూ కౌంటర్లను దాటుకుని వస్తుంది. ఉత్తరం వైపు ప్రస్తుతం ఉన్న ప్రాకార గోపురం కాకుండా రెండో గోపురం వైకుంఠ ఉత్తర ద్వారం వరకు నిర్మించనున్నారు. వీటికి మార్కింగ్ ఇచ్చిన అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రస్తుత ప్రాకారాల ఎత్తు పెంచి, కింది భాగంలో ఖాళీ స్థలాన్ని వివిధ మండపాలకు ఉపయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, శుక్రవారం ప్రాకారాల ఏర్పాటు వద్ద మట్టి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపనున్నారు.
26న తరలింపునకు ముహూర్తం
ఆలయ అభివృద్ధిలో కీలకమైన ఉపాలయాల్లోని మూలమూర్తుల తరలింపునకు ముహూర్తం ఖరారు చేశారు. 25న అంకురార్పణ జరపనుండగా, 26న కళావాహనం జరపనున్నారు. 26న ఉదయం 7.48 గంటలకు అంతరాలయంలోని మూలమూర్తుల పాదాల వద్ద అనుజ్ఞ తీసుకోనున్నారు. మూలమూర్తులను కలశాల్లోకి ఆవాహనం, ఇతర ప్రత్యేక పూజలు చేశాక, మూలమూర్తులను స్థపతులు తొలగించనున్నారు. శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు, గోదాదేవి అమ్మవార్ల మూర్తులను అంతరాలయంలో ఏర్పాటు చేసిన పూజా మందిరంలో ఏర్పాటు చేయనున్నారు. ఇతర మూలమూర్తులను, ఆళ్వార్లను రంగనాయకుల గుట్టపై ఏర్పాటు చేసిన బాలాలయానికి తరలించి నిత్య పూజలు జరపనున్నారు. 26న జరిగే పూజలకు ధర్మపురి, యాదగిరి గుట్ట, సింహాచలం దేవస్థానాల నుంచి పండితులు డిప్యూటేషన్‌పై రానున్నారు. ఇక మరో 30 మంది రుత్విక్కులను ప్రత్యేక విధుల కోసం రప్పించనున్నారు. పూజల్లో చిన్నజీయర్ స్వామి పాల్గొననున్నారు.
మే 1 నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేసేలా ఆర్‌అండ్‌బీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, అంచనాలను సిద్ధం చేస్తున్నారు. రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి, టెండర్లు ఆహ్వానించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆలయానికి ఉన్న ప్రాకారానికి తూర్పు, పడమర, ఉత్తరం వైపు ఒక్కో గోపురం ఉన్నాయి. తాజాగా ఆలయానికి రెండు ప్రాకారాలు, ఒక్కో వైపు రెండు గోపురాల చొప్పున నాలుగు వైపులా మొత్తం ఎనిమిది గోపురాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆలయం ప్రధాన భాగంలో ఒకటి, దానికి మరికొద్ది దూరంలో రెండో ప్రాకారం నిర్మించేలా గురువారం మార్కింగ్ ఇచ్చారు.


