● సగం మేర రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు ● తాత్కాలిక సిబ్బందితో నడిపించిన యాజమాన్యం ● డిపోల వద్ద నిరసన తెలిపిన కార్మికులు
చుంచుపల్లి: సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు గురువారం కూడా జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో కొనసాగింది. జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు డిపోల వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. అనంతరం సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు విన్నవించారు. రెండో రోజు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టగా, జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు డిపోల పరిధిలో సగం బస్సులు రోడ్డెక్కాయి. తాత్కాలిక సిబ్బందిని నియమించుకుని అధికారులు డ్యూటీలు కేటాయించడంతో వివిధ ప్రాంతాలకు బస్సులు తిరగడం ప్రారంభమయ్యాయి. అటు అద్దె బస్సులతోపాటు ఆర్టీసీ బస్సులు సైతం రాకపోకలు సాగించాయి. మొదటి రోజు కంటే రెండో రోజు కొత్తగూడెం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కొంత ఊరట కలిగింది. డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. బస్సులను నడిపేందుకు తాత్కాలిక సిబ్బందిని కండక్టర్లుగా నియమించడంతో పురుషులకు సైతం టికెట్లను జారీ చేశారు. రెండో రోజు మణుగూరు నుంచి 51 సర్వీసులు, కొత్తగూడెం నుంచి 46, భద్రాచలం నుంచి 42, ఇల్లెందు 15 నుంచి బస్సుల చొప్పున వివిధ ప్రాంతాలకు నడిపారు. అయితే ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి సమ్మెను ఉధృతం చేయాలని భావిస్తున్నారు. యూనియన్ కార్యాలయాల ముందు టెంట్లు వేసి వంట వార్పు వంటి నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. నర్సంపేట డిపో పరిధిలో కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో ఆర్టీసీ యాజమాన్యంతోపాటు పోలీసులు అప్రమత్తమైనట్లు తెలిసింది
ఆర్టీసీ సమ్మెను ఉధృతం చేస్తాం
ప్రభుత్వం ఆర్టీసీ నేతలతో తక్షణమే చర్చల జరిపి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో శుక్రవారం నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. గురువారం కొత్తగూడెం డిపో గేటు వద్ద కార్మికులు, కార్మిక సంఘాల జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు అనేక ఏళ్లుగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను సానుకూలంగా చర్చించి పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసి బస్సులను నడిపేందుకు ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కందుల భాస్కర్ రావు, వైఎన్‌రావు, పీఎన్ రావు, కర్నాటి నగేష్, భూక్య శ్రీనివాస్, రత్నకుమారి, అనిల్, కిరణ్, నజీర్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.


