మనమూ అవుదాం.. హీరో | - | Sakshi
Sakshi News home page

మనమూ అవుదాం.. హీరో

Apr 24 2026 6:14 AM | Updated on Apr 24 2026 6:14 AM

వేధింపులు లేకుండా చర్యలు

2021లో ‘గుడ్‌ సమారిటన్‌’ను అమల్లోకి తెచ్చిన కేంద్రం

అవగాహన కల్పిస్తున్న అధికారులు

భద్రాచలంఅర్బన్‌: జిల్లాలో నిత్యం ఎక్కడోచోట జరిగే రహదారి ప్రమాదాల్లో పలువురు మత్యువాత పడుతున్నారు. ప్రమాదం జరిగిన గంటలోపు అందించే సాయాన్ని గోల్డెన్‌ అవర్‌గా పరిగణిస్తారు. ఈ సమయంలో చికిత్స అందించ గలిగితే మరణాల శాతాన్ని సగానికి పైగా తగ్గించవచ్చనేది వైద్యుల అంచనా. కానీ, ప్రమాదాలు జరిగినపుడు అక్కడే ఉన్న చాలామంది క్షతగాత్రులను ఆస్పత్రులకు తీసుకెళ్లడానికి వెనుకంజ వేస్తున్నారు. పోలీస్‌ కేసుల భయమే ఇందుకు కారణం. ప్రజల్లో నెలకొన్న ఇలాంటి భయాన్ని పోగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స అందించే వారిని రహ–వీర్‌ (రహదారి హీరో), గుడ్‌ సమారిటన్‌ పేరుతో ప్రోత్సహించడమే కాకుండా నజరానా, ప్రత్యేక గుర్తింపు ఇవ్వనుంది.

ఏడాది వ్యవధిలో ఐదుసార్లు..

రోడ్డు ప్రమాదం జరిగిన గంటలోపే క్షతగాత్రులకు వైద్యం అందిస్తే వారి ప్రాణాలను రక్షించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కీలకమైన గోల్డెన్‌ అవర్లో బాధితులను ఆస్పత్రికి తరలించిన వ్యక్తులను కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌) రహ–వీర్‌ పురస్కారంతో సత్కరించనుంది. ఏడాది వ్యవధిలో ఐదుసార్లు ఈ నగదు పారితోషికాన్ని పొందవచ్చని రవాణా, పోలీసు అధికారులు చెబుతున్నారు. ఏడాది కాలంలో ఎక్కువసార్లు అవార్డు పొందినవారిని గుర్తించి కేంద్ర మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేస్తామని అధికారులు తెలిపారు. వారిలో 10 మందికి జాతీయ స్థాయిలో అవార్డు ప్రకటించి రూ.లక్ష నగదు పారితోషికంతోపాటు జాతీయస్థాయి ప్రశంసాపత్రాన్ని అందజేస్తారని పేర్కొన్నారు. ప్రజల్లో బాధ్యతారాహిత్యాన్ని తగ్గించి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే క్షతగాత్రులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని అధికారులు చెబుతున్నారు.

నమోదు ఇలా..

బాధితులను ఆస్పత్రికి తరలించిన తర్వాత సదరు వైద్యుడి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం పోలీసులు విచారణ చేపట్టి అధికారిక లెటర్‌ ప్యాడ్‌లో రహ–వీర్‌ పేరు, మొబైల్‌ నంబర్‌, చిరునామా, ప్రమాదం జరిగిన ప్రదేశం, తేదీ, సమయం, బాధితులను కాపాడడంలో అతను ఎలా సహాయం చేశారనే వివరాలు నమోదు చేస్తారు. రశీదు కాపీని సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ ద్వారా అప్రూవల్‌ కమిటీకి పంపిస్తారు. అప్రూవల్‌ కమిటీలో జిల్లా మెజిస్ట్రేట్‌, ఎస్పీ, వైద్యాధికారి, రవాణాశాఖ అధికారి ఉంటారు. కమిటీ ఎంపిక చేసిన వ్యక్తులకు రహ–వీర్‌ అవార్డు మొత్తాన్ని రవాణాశాఖ ద్వారా వారి ఖాతాల్లోకి జమచేస్తారు.

రూ.లక్షన్నర వరకు ఉచితవైద్యం

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు ఏ ఆస్పత్రికి వెళ్లినా తక్షణమే వైద్యం అందించాలని కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఎలాంటి షరతులు, ముందస్తు చెల్లింపులు లేకుండా బాధితులకు రూ.1.50 లక్షల విలువైన వైద్యాన్ని ఆస్పత్రులు వెంటనే అందించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే నేరుగా ఆస్పత్రులకు చెల్లిస్తుంది. ఈ విధానంతో ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా నిరుపేదలకూ వైద్యసాయం అందుతుంది.

రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారిని ఎవరైనా మానవతా దృక్పథంతో ఆస్పత్రికి తీసుకువెళ్లి సాయం అందిస్తే వారిని పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది వేధించకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడిన వ్యక్తికి చట్టపరమైన రక్షణ కల్పిస్తోంది. పోలీసుల వేధింపుల భయం లేకుండా ‘రహ–వీర్‌’ సేవలందించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది.

క్షతగ్రాతులను ‘గోల్డెన్‌ అవర్‌’లో తరలిస్తే రూ.లక్ష వరకు నజరానా

Advertisement
 
Advertisement
Advertisement