భద్రాచలంటౌన్: విదేశాల్లో ఉద్యోగాల కోసం గిరిజన నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా ఆస్ట్రేలియా, జర్మనీ, ఒమన్ దేశాల్లో ఉద్యోగాలకు నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. స్ప్రే పెయింటర్, ప్యానల్ బీటర్, ఆటోమొబైల్ మెకానిక్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, నర్సింగ్ వంటి పోస్టులకు ఐటీఐ, డిప్లొమా విద్యార్హత, అనుభవం ఉన్నవారు అర్హులని వివరించారు. ఎంపికై న వారికి రూ.24 లక్షల నుంచి రూ.48 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుందని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ, పాస్‌పోర్ట్, విద్యార్హత పత్రాలతో ఈ నెల 27, 28వ తేదీల్లో భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలోని భవిత సెల్‌లో దరఖాస్తులు సమర్పించాలని పీఓ సూచించారు.
ముగిసిన జెన్‌కో క్రీడలు
పాల్వంచ: స్థానిక విద్యుత్ కళాభారతి క్రీడా మైదానంలో కేటీపీఎస్ 7వ దశ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన జెన్‌కో ఇంటర్ ప్రాజెక్ట్‌స్ క్రీడా పోటీలు బుధవారం రాత్రి ముగిశాయి. వాలీబాల్ పోటీల్లో కేటీపీపీ జట్టు ప్రథమ, బీటీపీఎస్ ద్వితీయ, కేటీపీఎస్ 5, 6 దశలు తృతీయస్థానాల్లో నిలిచాయి. కబడ్డీలో వైటీపీఎస్ ప్రథమ, జూరా ద్వితీయ, కేటీపీఎస్ 7వ దశ తృతీయ స్థానాల్లో నిలిచాయి. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు సీఈ జె.సూర్యనారాయణ బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ ఎస్.యుగపతి, డిప్యూటీ సెక్రటరీ లోహిత్ ఆనంద్, స్పోర్ట్స్ సెక్రటరీలు వీరస్వామి, నరసింహ పాల్గొన్నారు.
‘ముత్తంగి’ కవచాల విరాళం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తులు ముత్తంగి కవచాలను విరాళంగా అందజేశారు. ధర్మవరం వేణుమాధవ్ – శిరీష దంపతులు సుమారు రూ.80 వేల విలువైన ఈ కవచాలను గురువారం ఆలయ ఈఓ దామోదర్‌రావుకు అందజేశారు. కార్యక్రమంలో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలుశిక్ష
ఖమ్మంలీగల్: చెల్లని చెక్కు జారీ చేసిన వ్యక్తికి ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు ప్రథమశ్రేణి న్యామూర్తి బి.రజని గురువారం తీర్పు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేశ్వాపురం వాసి వద్ద రుద్రంపూర్‌కు చెందిన జి.శ్రీనివాసరావు 2015 నవంబర్‌లో రూ.5 లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి 2017 నవంబర్‌లో రూ.3 లక్షలకు చెక్కు జారీ చేసినా ఆయన ఖాతాలో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. అంతేకాక సంతకం సరిపోలకపోవడంతో.. కేశ్వాపురం వాసి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం శ్రీనివాసరావుకు జైలుశిక్షతో పాటు ఫిర్యాదికి రూ.3 లక్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు.
వివాహిత ఆత్మహత్య
కరకగూడెం: వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన రాజశ్రీ (38) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఎంతకీ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి బావ రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ పీవీఎన్ రావు తెలిపారు. మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు.
చోరీ కేసులో
నిందితుడు అరెస్ట్
పాల్వంచ: పట్టపగలు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. ఈ నెల 22వ తేదీన పట్టణంలోని వెంకటేశ్వరహిల్స్‌కాలనీకి చెందిన తబస్సీన్ ఉద్యోగ విధుల నిమిత్తం భద్రాచలానికి ఉదయం వెళ్లి సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరుకుంది. అయితే ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోని ఫోన్, సిల్వర్ నాణెం, గ్యాస్ సిలిండర్, ఇతర వస్తువలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం వనమాకాలనీకి చెందిన కల్లూరి వంశీని అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీ చేసినట్లు తేలడంతో చోరీ చేసిన వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.


