జిల్లాలో కొద్దిరోజులుగా
నమోదవుతున్న ఉష్ణోగ్రతల వివరాలు
● జిల్లాలో 44 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు ● నేటి నుంచి మరింత పెరగనున్న ఎండల తీవ్రత
చుంచుపల్లి: భానుడు భగ్గుమంటున్నాడు. జిల్లాలో రోజురోజుకూ ఎండతీవ్రత పెరిగిపోతోంది. ఉదయం 10 గంటలు దాటితే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండవేడిమి తాళలేక జనం గడప దాటేందుకు భయపడుతున్నారు. వడగాలులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాయంత్రం 5 గంటలు దాటినా ఎండతీవ్రత తగ్గడం లేదు. మధ్యాహ్న సమయంలో ప్రధాన రహదారులు, ముఖ్య కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. 44 డిగ్రీలు దాటి పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో అత్యధిక ఉష్ణోగ్రత 44.01 డిగ్రీలుగా నమోదైంది. ఇక శుక్రవారం నుంచి ఈ నెల 29 వరకు 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ గురువారం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మరో వారం రోజుల పాటు ఎండలు నిప్పుల కొలిమిని తలపించేలా ఉండనున్నాయి. కొద్ది రోజులుగా ప్రజలు ఎండవేడిమిని తట్టుకోలేక మధ్యాహ్నంపూట పరిమితమవుతున్నారు. కూలర్లు, ఏసీలను అధికంగా వినియోగిస్తున్నారు. ఇటీవలకాలంలో విద్యుత్ వాడకం ఇళ్లలో విపరీతంగా పెరిగిపోయింది . శీతలపానీయాలు, కొబ్బరిబొండాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. కాగా, పలువురు ఎండ వేడిని తట్టుకోలేక వడదెబ్బతో అస్వస్థతకు గురవుతున్నారు.
తేదీ గరిష్ట ప్రాంతం
ఉష్ణోగ్రతలు
17 43.0 గరిమెళ్లపాడు
18 43.7 అశ్వాపురం
19 43.4 అశ్వాపురం
20 43.3 దుమ్ముగూడెం
21 43.5 సత్యనారాయణపురం
22 43.9 దుమ్ముగూడెం
23 44.1 ఏడూళ్లబయ్యారం


