పర్ణశాల వద్ద తగ్గుతున్న గోదావరి | - | Sakshi
Sakshi News home page

పర్ణశాల వద్ద తగ్గుతున్న గోదావరి

Apr 24 2026 6:14 AM | Updated on Apr 24 2026 6:14 AM

● జిల్లా తాగునీటి అవసరాలు తీరుస్తున్న నది ● మరో 20 రోజులకే భరోసా

● జిల్లా తాగునీటి అవసరాలు తీరుస్తున్న నది ● మరో 20 రోజులకే భరోసా

దుమ్ముగూడెం: మండలంలో గోదావరి నిత్యం పరవళ్లు తొక్కుతూ ఉండేది. 15 రోజులుగా పెరిగిన వేసవి ఉష్ణోగ్రతలతో గోదావరిలో నీటి నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఏప్రిల్‌ చివరికే గోదావరి వట్టిపోతోంది. మే నెలలో తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద గోదావరిలో నీటి నిల్వలు తగ్గిపోయి రాళ్లు బయటకు కనిపిస్తున్నాయి. దీంతో ఈ వేసవిలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక కార్యాచరణ అవసరం కానుంది.

నిత్యం 8.5 ఎంఎల్‌డీ వినియోగం

పర్ణశాల మిషన్‌ భగీరథ ఇంటేక్‌ వాల్‌ నుంచి దుమ్ముగూడెం, చర్ల మండలాలకు ప్రతీ రోజు 8.5 ఎంఎల్‌డీ నీటిని వినియోగిస్తున్నారు. చర్ల, దుమ్ముగూడెం మండలాలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. ఇందు కోసం ప్రధాన గ్రామాల్లో అంతటా ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌లు నిర్మించడంతో పాటు ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌ ఇచ్చారు. అయితే, ఇందుకు అవసరమైన రా వాటర్‌ను దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల గోదావరి నుంచి తీసుకుంటున్నారు. మిషన్‌ భగీరథకు ప్రతీ రోజు రెండు మండలాలకు 8.5 ఎంఎల్డీ నీటిని వినియోగిస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి గోదావరిలో ప్రవాహాలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రమాద ఘంటికలు మోగేలా ఉన్నాయి.

తేలిన బండరాళ్లు

కాటన్‌ ఆనకట్టకు ఎగువన ఉన్న లక్ష్మి, సమ్మక్క బరాజ్‌ నుంచి కనీస ప్రవాహాలే దిగువకు వదులుతున్నారు. దిగువకు వస్తున్న నీటికి, ఉపయోగిస్తున్న నీటికి మధ్య పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో క్రమంగా గోదావరి ఎండిపోతోంది. నదిలో ఎడమ వైపు మిషన్‌ భగీరథ, హెవీవాటర్‌ ప్లాంట్‌ ఇన్‌టేక్‌ వెల్స్‌ దగ్గరగానే ప్రవాహాలు ఉన్నాయి. కుడివై పున ఉన్న పర్ణశాల వైపు నదిలో ఇసుక మేటలు వేయగా, నదీ గర్భంలోని బండలు బయటకు కనిపిస్తున్నాయి.

20 రోజులకే..

ప్రస్తుతం గోదావరిలో నీటి నిల్వల పరిస్థితి చూస్తుంటే మరో 20 రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ, మేనెలలో ఎండలు మరింతగా ముదిరితే నీటి ఆవిరి నష్టాలు పెరిగి గోదావరిలోని నీటి నిల్వలు వేగంగా తగ్గిపోయే అవకాశముంది. కాగా మండలంతో పాటు జిల్లాలో నీటి సమస్య రాకుండా అధికారులు పైనున్న లక్ష్మి, సమ్మక్క బరాజ్‌ నుంచి నీరు విడుదల చేయించడంతో పాటు వచ్చే ప్రవాహాలను జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement