● ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపణ ● కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు
పాల్వంచ: ప్రేమ పేరుతో తనను శారీరకంగా, ఆర్థికంగా వాడుకున్నాడని ఆరోపిస్తూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. టెంటు వేసి కుటుంబ సభ్యులతో కలిసి దీక్ష చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పట్టణంలోని బొల్లేరుగూడెం ఏరియాకు చెందిన రావూరి శ్రీరామ్ ఇంటి ముందు గురువారం ఓ యువతి తన కుటుంబ సభ్యులతో వచ్చి టెంటు వేసుకుని బైఠాయించింది. తాను, శ్రీరామ్ ఇద్దరం ఆరేళ్లుగా ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకోమని కొంతకాలంగా కోరుతున్నా పట్టించుకోకుండా దాట వేస్తుడని ఆరోపించింది. తనను శారీరకంగా, ఆర్థికంగా వాడుకున్నాడని వాపోయింది. ఈ క్రమంలో శ్రీరామ్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడని కుటుంబ సభ్యులు తెలపారు. పారాసిటమోల్ మాత్రలు వేసుకుని మరో డ్రామాకు ఆడుతున్నాడని యువతి ఆరోపించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నాగరాజు అక్కడికి చేరుకుని వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు.
21న జరగాల్సిన పెళ్లి
కాగా, బొల్లేరుగూడెం ఏరియాకు చెందిన ఇద్దరూ ప్రేమించుకుంటున్న విషయంపై 20వ తేదీన పంచాయితీ జరిగింది. ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. కాగా, కుల పెద్ద మనుషులు, ఇరు కుటుంబాల సమక్షంలో ప్రేమిస్తున్న యువతిని 21వ తేదీన పెళ్లి చేసుకుంటానని శ్రీరామ్ ఒప్పుకుని లేఖ రాసి పెద్దమనుషులతో పాటు, ప్రతిని పోలీసులకు సమర్పించినట్లు తెలిసింది. అయితే పెళ్లి చేసుకోకుండా వాయిదా వేయడం, పట్టించుకోక పోవడంతో పాటు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపి వాయిదా వేస్తూ వచ్చినట్లు సమాచారం. పోలీసులను వివరణ కోరగా ఫిర్యాదు రాలేదని, ఆందోళన చేస్తున్న వారిని తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇస్తున్నామని, పూర్తి వివరాలు తర్వాత చెబుతామని తెలిపారు.


