● కుటుంబ కలహాలే కారణమని పోలీసులకు ఫిర్యాదు ● ఆర్టీసీ సమ్మె నేపథ్యాన ఆందోళన
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం రీజియన్‌లోని భద్రాచలం ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న గూడూరు లింగారెడ్డి గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న తరుణాన ఆయన గడ్డి మందు తాగినట్లు తెలియగానే అధికారులు, కార్మికులు ఉలిక్కిపడ్డారు. లింగారెడ్డిని చికిత్స నిమిత్తం కుటుంబీకులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
కుటుంబ కలహాలతోనే..
పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖమ్మం డిపో వద్ద గురువారం జరిగిన నిరసనలో పాల్గొన్న లింగారెడ్డి సాయంత్రం 4 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ నాయుడుపేటలోని నివాసానికి వెళ్లాడు. ఇంటి బయటే ద్విచక్రవాహనం నిలిపి బండిలో ఉన్న గడ్డిమందు తీసి భార్య ముందే తాగాడు. దీంతో ఆయన భార్య జయమ్మ అడ్డుకుంటూ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలియగానే టూటౌన్ పోలీసులు ఆస్పత్రికి వెళ్లి లింగారెడ్డి, ఆయన భార్య స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. లింగారెడ్డి తన భార్య పెడుతున్న ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పాడని వెల్లడించారు. ఆయన భార్య జయమ్మ మాత్రం మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెకు డబ్బులు ఇస్తుండడమే కాక.. ఇప్పుడు తన పేరు బద్నాం చేస్తున్నాడని ఆరోపించింది. కాగా, ఆస్పత్రికి ఆర్టీసీ ఆర్‌ఎం ఎ.సరిరామ్ చేరుకొని లింగారెడ్డితో మాట్లాడాక ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. అయితే, లింగారెడ్డి ఆత్మయత్యాయత్నం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కార్మికులు, నేతలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


