సీతారామ రీ డిజైన్‌తో మాయమైన రాజీవ్ సాగర్
పదేళ్లు గడిచినా పట్టించుకోని ప్రభుత్వం
ఇల్లెందు నియోజకర్గానిదీ
అదే పరిస్థితి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కూలిన మేడిగడ్డ బరాజ్ మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రాణహిత ఎత్తిపోతల విషయంలోనూ కదలిక వచ్చింది. కానీ రాజీవ్ ఆయకట్టుకు నీరు అందించే విషయంపై ఎలాంటి పురోగతి లేకపోవడం జిల్లా వాసులను నిరాశకు గురిచేస్తోంది.
రాజీవ్‌సాగర్ టు సీతారామ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో రాజీవ్‌సాగర్, ఇందిర సాగర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రాజీవ్‌సాగర్ కింద కొత్తగూడెం, ఇల్లెందు, మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకర్గాల పరిధిలో రెండు లక్షల కొత్త ఆయకట్టు రావాల్సి ఉంది. అలాగే, ఇందిరారసాగర్ కింద అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకర్గాల పరిధిలో కొత్తగా రెండు లక్షల ఎకరాల ఆయకట్టు రావాలి. తద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని పది అసెంబ్లీ నియోజకర్గాల రైతులకు కృష్ణా, గోదావరి జలాలు అందుబాటులోకి వచ్చేవి. అయితే రాష్ట్ర విభజనతో ఇందిరాసాగర్ ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలం ఏపీలోకి వెళ్లింది. దీంతో తెలంగాణ ఏర్పడ్డాక రాజీవ్‌సాగర్, ఇందిరసాగర్ ప్రాజెక్టులకు ఒక్కటిగా చేస్తూ సీతారామ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు.
పదేళ్ల క్రితం మొదలు
టేకులపల్లి మండలం రోళ్లపాడు దగ్గర సీతారామ ప్రాజెక్ట్ పనులకు 2016 ఫిబ్రవరిలో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రోళ్లపాడు ప్రాంతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతం కావడంతో ఇక్కడ 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని ప్రతిపాదించారు. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి దగ్గర గోదావరిపై సీతమ్మ సాగర్ బరాజ్‌ను నిర్మించాలి. అక్కడి నుంచి కిన్నెరసాని మీదుగా రోళ్లపాడు వరకు గోదావరి నీటిని ఎత్తిపోయాలి. ఆపై గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని కొత్తగూడెం, ఇల్లెందు, మహబూబాబాద్, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలకు తరలించాలనే ప్రణాళిక రూపొందించారు.
హామీలతోనే సరి
సీతారామ ప్రాజెక్ట్ పంప్‌హౌస్‌లను 2024 ఆగస్టులో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలుమార్లు ప్రాజెక్టు పనులపై సమీక్షలు నిర్వహించారు. బహుళార్థ సాధక ప్రాజెక్టులో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లేకపోవడం పెద్ద లోటని, రోళ్లపాడు దగ్గర రిజర్వాయర్ నిర్మించే ప్రణాళికను పరిశీలించాలని మంత్రి పొంగులేటి అధికారులకు సూచించారు. ఇది జరిగాక ఏడాది తర్వాత 2025 ఏప్రిల్ 17న ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సైతం సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ప్రత్యేక అపాయింట్‌మెంట్ సాధించి ఇల్లెందుకు గోదావరి జలాల అంశాన్ని ప్రస్తావించారు. అదే ఏడాది మే 12న సీతారామపై జరిగిన సమావేశానికి గుమ్మడిని సైతం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఇల్లెందుకు న్యాయం చేస్తామంటూ ప్రభుత్వం నుంచి హామీ దక్కింది. హామీల మీద హామీలు వచ్చాయే తప్పితే ఇల్లెందు నియోజకవర్గానికి గోదావరి నీళ్లు అందించే అంశంపై చిత్తశుద్ధి కరువైందనే విమర్శలు ప్రభుత్వంపై వస్తున్నాయి.
‘రాజీవ్ ఆయకట్టు’కు కలగానే మిగులుతున్న సాగునీరు


