తొలిరోజు సమ్మె సక్సెస్‌ | - | Sakshi
Sakshi News home page

తొలిరోజు సమ్మె సక్సెస్‌

Apr 23 2026 7:42 AM | Updated on Apr 23 2026 7:42 AM

ప్రభుత్వం మొండివైఖరి వీడాలి

బస్టాండ్లు, డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

డిపోల వద్ద నిరసనలు, కార్మికుల అరెస్ట్‌

ఆర్టీసీకి భారీ నష్టం.. ప్రయాణికులకు అవస్థ

బస్సులు లేవు

ఎదురుచూపులే..

చుంచుపల్లి: న్యాయమైన డిమాండ్ల సాధనకు ఆర్టీసీ కార్మికులు బుధవారం తెల్లవారుజాము నుంచి సమ్మెకు దిగారు. కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా నిరసన వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. దీంతో బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. మొదటిరోజు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ప్రశాంతంగా కొనసాగింది. అధికారులు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, ప్రైవేటు బస్సుల కార్మికులతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా ఫలితం కనిపించలేదు. ఆర్టీసీ సమ్మె సమాచారం లేక బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ కనిపించింది. బస్సులు నిలిచిపోవడంతో గంటల కొద్దీ వేచి చేశారు. ఖమ్మం, హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఇల్లెందు, మణుగూరు, భద్రాచలంతో పాటు ఆంధ్రరాష్ట్రం వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో పలువురు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.

తొలి రోజు ఆర్టీసీకి భారీ నష్టం

సమ్మె కారణంగా బుధవారం జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లింది. భద్రాచలంలో 27 సర్వీసులు, కొత్తగూడెంలో 31 సర్వీసులు, ఇల్లెందులో ఆరు, మణుగూరులో ఒకటి చొప్పున.. మొత్తం 65 బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి. ఉదయం నుంచి డిపో గేట్ల వద్ద బస్సులు బయటకు రాకుండా ఆర్టీసీ జేఏసీ నాయకులు అడ్డుకోవడంతో అధికారులు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత పలువురు నాయకులు, కార్మికులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించడంతోపాటు బస్టాండ్లు, డిపోల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో అధికారులు కొద్ది సర్వీసులను మాత్రం తిప్పగలిగారు. భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు నాలుగు డిపోల పరిధిలో మహాలక్ష్మి టికెట్లతో కలిపి నిత్యం రూ. 60 లక్షల నుంచి రూ. 65 లక్షల వరకు ఆదాయం వస్తోంది. సమ్మె నేపథ్యంలో కండక్టర్లు అందుబాటులో లేకపోవడంతో తిప్పిన కొన్ని సర్వీసుల్లో పురుషులకు సైతం ఉచిత ప్రయాణాన్ని కల్పించారు. దీంతో ఆర్టీసీ పూర్తి ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. జిల్లావ్యాప్తంగా నాలుగు డిపోల పరిధిలో 879 మంది కార్మికులు తొలిరోజు విధులు బహిష్కరించారు. మొదటి రోజు సమ్మె విజయవంతం కావడంతో ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక సిబ్బందిని నియమించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కండక్టర్‌కు రోజుకు రూ. 800, డ్రైవర్‌కు రూ.1000 చొప్పున చెల్లిస్తూ గురువారం నుంచి నియామకం చేపట్టనుంది.

ప్రభుత్వం మొండివైఖరి వీడి ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లను పరిష్కరించాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కోరారు. బుధవారం కొత్తగూడెం ఆర్టీసీ బస్‌ డిపో గేటు వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతియుతంగా సమ్మెకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తి లేదని, గురువారం నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు కందుల భాస్కర్‌ రావు, సలిగంటి శ్రీనివాస్‌, జమలయ్య, కర్నాటి నగేష్‌, భూక్య శ్రీనివాస్‌, రత్నకుమారి, సింగ్‌, అనిల్‌, కిరణ్‌, నజీర్‌, రమేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

మాకు ఆర్టీసీలో సమ్మె తెలియదు. సత్తుపల్లి వెళ్లాలని కుటుంబ సభ్యులతో వచ్చాం. గంట నుంచి బస్సుల కోసం అవస్థలు పడుతున్నాం. ఎలా ఇంటికి వెళ్లాలో తెలియడం లేదు. అధికారులు కూడా ఏమీ చెప్పడం లేదు.

–వెంకటమ్మ, ప్రయాణికురాలు

నేను విజయవాడ వెళ్లేందుకు ఉదయం 9 గంటలకు బస్టాండ్‌కు వచ్చాను. రెండు గంటలపాటు ఎదురుచూశాను. బస్సులు రాలేదు. మరికొద్ది చూపు చూసి ప్రైవేటు వాహనాలు ఉంటే వెళ్తా, లేకపోతే ఇంటిదారి పడతాను.

–ఎస్‌.ఆదినారాయణ, ప్రయాణికుడు

Advertisement
 
Advertisement
Advertisement