ఆహ్లాదం పంచే జీవవైవిధ్యం
వైల్డ్‌లైఫ్ డివిజన్ కార్యాలయానికి చేరుకున్న మూడు సఫారీ వాహనాలు
వారంలో ప్రారంభం కానున్న సఫారీ టూర్
పాల్వంచరూరల్: పర్యాటకులు ఇక అడవిలోకి దూసుకెళ్లొచ్చు. బుధవారం పాల్వంచ వైల్డ్‌లైఫ్ డివిజన్ కార్యాలయానికి సఫారీ వాహనాలు చేరుకున్నాయి. వారం రోజుల్లో అవి అభయారణ్యంలో తిరగనున్నాయి. పర్యాటకులకు జంతువులతోపాటు సహజసిద్ధమైన అడవిని వీక్షించే అవకాశం ఉంది. రాష్ట్రంలో అమ్రాబాద్, కల్వాల్, గడ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన మాదిరిగా సఫారీతోపాటు జలాశయంలో ప్రత్యేక బోటు సౌకర్యాన్ని కిన్నెరసాని అభయారణ్యంలో ఏర్పాటు చేయాలని గతేడాది కార్యాచరణ రూపొందించారు. అయితే సఫారీ వాహనాల తయారీలో జాప్యం జరిగింది. తొలుత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పులిగుండాల పరిధిలోని అటవీ ప్రాంతం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అడవిని సంరక్షిస్తూనే స్థానిక గిరిజనులకు ఉపాధి, లబ్ధి చేకూర్చేలా ఎకో టూరిజం ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఇటీవల ఆదేశించారు. వన సంవరక్షణ సమితుల ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఒక సమితిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, రూ.20 లక్షలు ప్రకటించారు. ఇటీవల పులిగుండాల విహారయాత్ర కోసం రెండు సఫారీ వాహనాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ములుగు జిల్లాలో కొత్తగా పర్యాటకులను ఆకర్షించేందుకు సఫారీ వాహనాలు ఏర్పాటు చేయగా, మంత్రి సీతక్క ప్రారంభించారు.
ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే..
కిన్నెరసాని డీర్ పార్కు నుంచి పది కిలోమీటర్ల దూరంలో గల బేస్‌క్యాంప్ గుట్టవరకు సఫారీ ద్వారా అభయారణ్యం అందాలు, వన్యప్రాణులను తిలకించేవిధంగా ప్రణాళిక రూపొందించారు. అందుకోసం రూ.45 లక్షలు వ్యయం చేసి పదిమంది కూర్చునేలా మూడు సఫారీ వాహనాలను వైల్డ్‌లైఫ్ శాఖ కొనుగోలు చేసింది. ఈ వాహనాల్లో ఇంకొన్ని మార్పులు చేయాల్సి ఉంది.
కిన్నెరసాని డీర్ పార్కు వద్ద నుంచి సఫారీ వాహనాలను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సఫారీలో ప్రయాణించే వారికి ముందుగా రూ.200 లోపు టికెట్ నిర్ణయించాలనుకుంటున్నాం. డీర్ పార్కు నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మొండికట్ట వాచ్‌టవర్ వరకు, మరో వాహనం డీర్‌పార్కు నుంచి కాటేజీలు, అద్దాల మేడ వరకు ముందుగా తిప్పుతాం.
–జి.కృష్ణాగౌడ్, జిల్లా అటవీ శాఖాధికారి
జీవవైవిధ్యం, కనుచూపు మేర విస్తరించిన అడవి, కొండలు, కోనలు, పచ్చని చెట్లు, జలాశయం, వన్యప్రాణులకు నిలయమైన కిన్నెరసానిలో సఫారీ వాహనాల ఏర్పాటుపై హర్షం వ్యక్తమవుతోంది. కాగా, కిన్నెరసానిలో తొమ్మిది కాటేజీలు, అద్దాల మేడ పనులు పూర్తి చేశారు. వాటిని ఇంతవరకు ప్రారంభించలేదు.


