రామయ్యకు స్నపన తిరుమంజనం | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు స్నపన తిరుమంజనం

Apr 23 2026 7:42 AM | Updated on Apr 23 2026 7:42 AM

భద్రాచలంటౌన్‌: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారికి బుధవారం స్నపన తిరుమంజనం జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.

26న ‘కళావాహన’

భద్రాచలం ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో ఈ నెల 26న ఆలయంలో కళావాహన కార్యక్రమం నిర్వహించనునున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల కారణంగా చుట్టుగుళ్లలోని దేవతామూర్తులను రంగనాయకులగుట్టపై ఉన్న రామదాసు ధ్యాన మందిరానికి, ఆండాళ్‌, లక్ష్మీతాయారు అమ్మవార్లను ప్రధాన ఆలయ ముఖమండపానికి తరలించి ప్రతిష్ఠించనున్నారు. ఈ క్రమంలో 26న మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని రకాల ఆర్జిత సేవలు, దర్శనాలను నిలిపివేయనున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఈ మేరకు ఈఓ కె. దామోదర్‌ రావు బుధవారం వివరాలు వెల్లడించారు.

గుబ్బల మంగమ్మ

ఆలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్‌

అశ్వారావుపేటరూరల్‌: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సరిహద్దు అశ్వారావుపేట మండలంలోని గోగులపూడి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) వేణుగోపాల్‌ సందర్శించారు. బుధవారం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ తాటి కృష్ణ, జీపీఓ వెంకటేశ్వర్లు, వీఆర్‌ఏలు విజయ్‌, రాము పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement