జనగణనకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

జనగణనకు సన్నద్ధం

Apr 23 2026 7:42 AM | Updated on Apr 23 2026 7:42 AM

ఏర్పాట్లు చేస్తున్నాం

ఏమేమీ సేకరిస్తారంటే..

2011 లెక్కల ప్రకారం జిల్లాలో జనాభా వివరాలు

జిల్లాలో జనాభా లెక్కల సేకరణకు కసరత్తు రెండు యాప్‌ల ద్వారా 33 అంశాల వారీగా సేకరణ రెండు దశల్లో 1,780 మంది సిబ్బందితో విధులు ఎన్యుమరేటర్లకు కొనసాగుతున్న శిక్షణ తరగతులు

చుంచుపల్లి: జిల్లాలో జనగణన–2027కు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రణాళిక గణాంక శాఖ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. 2020 ఏప్రిల్‌లోనే జనగణన ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా, కరోనా కలకలంతో వాయిదాపడింది. 2027 జనాభా లెక్కలను రెండు విడుతల్లో 33 అంశాలపై వివరాలు సేకరించనున్నారు. ఈసారి ప్రత్యేకంగా సీఎంఎంఎస్‌(సెన్సెస్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌) మొబైల్‌ యాప్‌లు వాడనున్నారు. జిల్లాలో 1,780 మంది సిబ్బందిని కేటాయించారు. వీరిలో 40 మంది మండల స్థాయి అధికారులు కాగా, 1,615 మంది వరకు ఎన్యుమరేట్లర్లు, మరో 125 మంది సూపర్‌వైజర్లు ఉన్నారు. ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించారు. ఎన్యుమరేటర్లకు శిక్షణ తరగతులు కొనసాగుతుండగా, ఈ నెల 30వ తేదీ లోగా శిక్షణ కార్యక్రమం పూర్తికానుంది.

రెండు విడతల్లో గణన

జనాభా గణన రెండు విడతల్లో చేపట్టనున్నారు. మొదట మే 11 నుంచి జూన్‌ 9 వరకు బ్లాక్‌ పరిధిలోని మొదట ఇళ్ల సంఖ్యను లెక్కిస్తారు. దాదాపు 45 రోజులపాటు ఇళ్ల జాబితాను సేకరిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టే రెండో దశలో జనాభా, పూర్తి వివరాలను నమోదు చేస్తారు. ఇళ్లలో ఉన్న జనాభా (జాతీయ జనాభా రిజిస్టర్‌)ను లెక్కిస్తారు. ప్రాథమికంగా 200 నుంచి 250 గృహాల వరకు ఒక బ్లాక్‌గా విభజించి ఓ ఎన్యుమరేటర్‌ను నియమిస్తారు. జనగణనకు ముందు పశుగణన కూడా చేపడతారు.

16వ సారి

ఇప్పటివరకు 15 సార్లు దేశ వ్యాప్తంగా జనాభా లెక్కలు సేకరించగా, మే నెలలో చేపట్టబోయేది పదహారోసారి కానుంది. చివరగా 2011లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనాభా లెక్కల వివరాలు సేకరించారు. 2016 అక్టోబర్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడగా, కొత్త జిల్లాలో తొలిసారిగా జనగణన జరగనుంది. కాగా జనాభా లెక్కల ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక ఆర్థిక, అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తాయి. ఆహార ధాన్యాల నిల్వలు, ఉపాధి, ఉద్యోగాల కల్పన సహా అన్ని రంగాల్లో రూపొందించే ప్రణాళికలు జనాభా లెక్కలపై ఆధారడి ఉంటాయి.

జిల్లాలో 2027 జనాభా లెక్కల సేకరణ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతీ పదేళ్లకోసారి జనగణన నిర్వహించడం ఆనవాయితీ. కొత్తగా ఏర్పడిన జిల్లాలో తొలిసారిగా జనాభా లెక్కలు సేకరించనున్నారు. జనగణనపై అధికారులు, ఎన్యుమరేటర్లకు శిక్షణలో అవగాహన కల్పిస్తున్నాం. –కే.సంజీవరావు, సీపీఓ

జనాభా గనణలో వ్యక్తి పేరు, ఇంటిపేరు, కుటుంబ యజమాని, యజమానితో బంధుత్వం, వయసు, లింగం, చదువు, టీవీ, ద్విచక్ర వాహనం, కారు వంటి వివరాలు నమోదు చేస్తారు. ఎస్సీ, ఎస్టీల కులం వివరాలు కూడా సేకరిస్తారు. పురుషులు, మహిళలు, థర్డ్‌ జెండర్స్‌ వివరాలు వేర్వేరుగా నమోదు చేస్తారు. సిగ్నల్‌, సాంకేతిక సమస్యలతో యాప్‌లో విరాలు నమోదు చేయలేని పక్షంలో ఎప్పటిలా సాధారణ పద్ధతి (మాన్యువల్‌)లో కూడా గణన చేయనున్నారు. తర్వాత ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తారు.

జిల్లాలో గృహాల సంఖ్య: 2,79,190

మొత్తం జనాభా: 10,69,261

పురుషులు: 5,32,390

మహిళలు: 5,36,871

గ్రామీణ జనాభా: 7,30,178 (68.01శాతం)

పట్టణ జనాభా: 3,39,083 (31.71 శాతం)

ప్రతి వెయ్యిమంది

పురుషులకు సీ్త్రలు: 1008

Advertisement
 
Advertisement
Advertisement