ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Apr 23 2026 7:42 AM | Updated on Apr 23 2026 7:42 AM

భద్రాచలంటౌన్‌: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యాన కొనసాగుతున్న ప్రత్యేక గిరిజన డీఎల్‌ఎడ్‌ కళాశాలలో ప్రవేశాల (2026–28 విద్యాసంవత్సరం)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీఓ బి.రాహుల్‌ తెలిపారు. ఏజెన్సీ ప్రాంత గిరిజన అభ్యర్థుల కోసం ఉద్దేశించిన రెగ్యులర్‌ కోర్సులో మొత్తం 50 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌లో కనీసం 45 శాతం మార్కులు సాధించిన వారు అర్హులని, మెరిట్‌, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక ఉంటుందని వివరించారు. భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరు, మన్ననూరు ఐటీడీఏ కార్యాలయాల్లో లభించే దరఖాస్తులు తీసుకుని, మే 11వ తేదీలోగా సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు 99595 75539, 86390 84543, 83099 72776 నంబర్లను సంప్రదించాలని పీఓ వివరించారు.

టీయూవీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా నర్సయ్య

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా శ్రావణబోయిన నర్సయ్యను బుధవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా టీయూవీ రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ మాట్లాడుతూ.. నర్సయ్య 1969 తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని, 1969 తెలంగాణ ఉద్యమ పోరాట సమితి స్థాపించి ఇప్పటివరకు తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్‌, ఇంటి స్థలం, ఉచిత వైద్యం, ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని పోరాటాలు కొనసాగిస్తున్నారని చెప్పారు.

ఆస్పత్రిలో

‘కాయకల్ప’ పరిశీలన

అశ్వారావుపేటరూరల్‌: అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని బుధవారం కేంద్ర ప్రభుత్వ కాయకల్ప అవార్డు బృందం సందర్శించింది. డాక్టర్‌ రఘు పూజారి, డాక్టర్‌ జ్యోత్స్న ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి తెలుసుకున్నారు. ల్యాబ్స్‌, మందులు, స్కానింగ్‌, డయాలసిస్‌, వ్యాక్సినేషన్‌, పోస్టుమార్టం, శానిటేషన్‌ విభాగాలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రవిబాబు, మెడికల్‌ సూపరిటెండెంట్‌ డాక్టర్‌ రాధా రుక్మిణి, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

రెండు లారీలు ఢీ

మణుగూరుటౌన్‌: మండలంలోని 100 పడకల ఆస్పత్రి సమీపంలో రెండు లారీలు ఢీకొన్న ఘటన బుధవారం రాత్రిచోటుచేసుకుంది. ఇద్దరు గాయపడగా, ప్రాణాపాయం తప్పింది. లోడ్‌తో కొత్తగూడెం వైపు వెళ్తున్న టిప్పర్‌ను, అదే దిశగా వెళ్తున్న ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ లారీ ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రాన్స్‌పోర్ట్‌ లారీ డ్రైవర్‌, టిప్పర్‌ క్లీనర్‌కు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 100 పడకల ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో

వ్యక్తికి గాయాలు

అశ్వాపురం: మండలంలోని గోపాలపురం వద్ద మణుగూరు – కొత్తగూడెం ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని మల్లెలమడుగు గ్రామానికి చెందిన ప్రైవేట్‌ బస్సుడ్రైవర్‌ గాదెనబోయిన మహేశ్‌ బైక్‌పై మణుగూరు నుంచి వస్తుండగా గోపాలపురం వద్ద మణుగూరు వైపు వెళ్తున్న ట్రాలీ ఆటో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మహేశ్‌ను 108 వాహనంలో మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement