● మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి ● రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర రావు
ఖమ్మంసహకారనగర్: అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో వివిధ అంశాలపై బుధవారం ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ వరి ధా న్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో ఆటంకాలు రాకుండా ఏర్పాటుచేయాలని తెలిపారు. అలాగే, జూన్ మొదటి వారంకల్లా ఖమ్మం బైపాస్ నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు మున్నేరు రిటైనింగ్ వాల్ పూర్తిచేయాలని చెప్పారు. అంతేకాకుండా 20ఎకరాల్లో ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం, క్రీడాకారుల వసతి గృహాలు, కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి రూ.92 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కాగా, వెలుగుమట్ల అర్బన్ పార్క్‌కు వెళ్లే మార్గంలో డివైడర్ అధిక స్థలం ఆక్రమించినందున, భవిష్యత్‌లో మార్పు చేయాలని పేర్కొన్న మంత్రి... ధంసలాపురం ఎస్టీపీ స్థలం అప్పగింత, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పైప్‌లైన్ పనులు, రోప్ వే నిర్మాణంలో వేగంపై సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ జిల్లాలో 2.17 లక్షల టన్నుల మొక్కజొన్నల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 39 వేల టన్నులు సేకరించామని తెలిపారు. అలాగే, వరి ధాన్యం కొనుగోళ్లకు 240 కేంద్రాలు ప్రారంభించామని చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో కేఎంసీ కమీషనర్ అభిషేక్ అగస్త్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కాళ్లు పట్టుకుని ఒప్పించే వాడిని కదా?
సత్తుపల్లి: ‘ఏడాది నుంచి పట్టించుకోకుండా భూసేకరణ సమస్య ఉందని ఇప్పుడు చెబుతారా.. ముందే చెబితే నేనే కాళ్లు పట్టుకునైనా ఒప్పించేవాడిని కదా.. నిధులు ఇచ్చినా అధికారులు చేసిన తప్పుకు పనులు ఆగితే ఎలా?’ అంటూ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. అన్నపురెడ్డిపల్లి, సత్తుపల్లి మండలాల్లో సీతారామ కాలువ, యాతాలకుంట టన్నెల్ పనులను భద్రాద్రి, ఖమ్మం కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, అంకిత్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం యాతాలకుంటలో అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. రూ.700 కోట్లతో చేపట్టిన సత్తుపల్లి ట్రంక్ పనుల్లో కేవలం 50మీటర్లు పరిహారం చెల్లింపులో పొరబాటు కారణంగా ఆగడానికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు. పరిహారం చెల్లింపులో పేరు మారడం వల్ల ఇబ్బంది ఎదురైందని అధికారులు చెప్పగా.. ఎవరికై నా చెప్పారా అని నిలదీశారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని కల్లూరు ఏసీపీ వసుంధరయాదవ్‌ను ఆదేశించారు. ఒకరిపై ఒకరు నెపం మోపుకుంటూ కాలం వెళ్లదీస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఏదిఏమైనా వచ్చే వర్షాకాలానికి సత్తుపల్లి ట్రంక్ పనులు, యాతాలకుంట టన్నెల్ పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష అని మంత్రి తుమ్మల తెలిపారు. సత్తుపల్లి ట్రంక్ పూర్తయితే సత్తుపల్లి, వేంసూరు, దమ్మపేట మండలాలకు గోదావరి జలాలు వస్తాయన్నారు. కాల్వ మట్టి కొన్ని చోట్ల కుంగి పడిపోతుందని.. దీన్ని పరిగణనలోకి తీసుకుని నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని తెలిపారు. కల్లూరు సబ్‌కలెక్టర్ అజయ్‌యాదవ్, సీతారామ ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి, కృష్ణ, ఎం.డీ.రెహానాబేగం, బొంతు సుమలత, దోమ ఆనంద్‌బాబు, మట్టా దయానంద్, చల్లగుళ్ల నర్సింహారావు, చెన్నారావు పాల్గొన్నారు.


