● కేంద్రాల్లో మండుటెండలో పడిగాపులు కాస్తున్న రైతులు ● విధిలేక తక్కువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు విక్రయం
బూర్గంపాడు: యాసంగి ధాన్యం విక్రయించుకునేందుకు రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. జిల్లాలో నెలరోజులుగా ధాన్యం చేతికివస్తున్నా కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకోలేదు. ఈ సీజన్‌లో 83,650 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 168 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఇటీవల ప్రారంభించింది. అయితే కొనుగోళ్లు వేగవంతం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 20 రోజుల నుంచి రైతులు ధాన్యం ఆరబెట్టి ఎదురుచూస్తున్నారు. మండుటెండల్లో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. వాతావరణ మార్పులతో మబ్బులు పడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. బుధవారం సాయంత్రం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురియగా, రైతులు ఉరుకులు, పరుగులతో పట్టాలు కప్పుకుని ధాన్యం కాపాడుకున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో మద్దతు ధర కోసం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకుంటున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.2,389 ఉండగా, ప్రైవేటు వ్యాపారులు రూ.1500కే కొంటున్నారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోకపోవడంతో రాశులు పేరుకుపోతున్నాయి. మిగతా రైతులకు ధాన్యం ఆరబెట్టుకునేందుకు స్థలం కూడా ఉండటం లేదు. ఈ వెతలన్నీ పడలేక రైతులు ప్రైవేటు వ్యాపారులకు, మిల్లర్లకు తక్కువ ధరకే విక్రయించుకుంటున్నారు. కాగా ప్రభుత్వ కేంద్రాల్లో నాలుగైదు లారీల ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించగా, నాణ్యత లేదంటూ తీసుకునేందుకు మిల్లర్లు విముఖత చూపినట్లు తెలుస్తోంది.


