చాన్నాళ్ల తర్వాత..
జేఏసీ ఆధ్వర్యాన నిర్వహణకు సన్నద్ధం
జిల్లాలో నేటి ఉదయం నుంచి
నిలిచిపోనున్న బస్సులు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై
దృష్టి సారించిన అధికారులు
సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం
టీజీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు యూనియన్లను అనుమతించాలనే తదితర 32డిమాండ్లతో బుధవారం తెల్లవారుజాము (మొదటి షిప్ట్) నుంచి కార్మికులు విధులను బహిష్కరించి సమ్మె బాట పట్టనున్నారు. గడిచిన వారం రోజులుగా ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యాన సమ్మెకు కార్మికులను సన్నద్ధం చేస్తున్నారు. ఈక్రమాన ఉన్నతాధికారులు హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన చర్చలు విఫలం కావడంతో సమ్మె ఖాయమని ప్రకటించారు. – చుంచుపల్లి
ఇవీ ప్రధాన డిమాండ్లు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు కార్మిక సంఘాల పునరుద్ధరణ, రెండో వేతన సవరణ, విశ్రాంత ఉద్యోగుల బకాయిల చెల్లింపు వంటి కీలక డిమాండ్లతో కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. అంతేకాక ఖర్చులు తగ్గించుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం టిమ్స్ డ్యూటీలు పెంచుతూ ఇబ్బంది పెడుతోందని జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎనిమిది గంటలకు బదులు 12 గంటల వరకు పనిచేయిస్తూ స్పెషల్ ఆఫ్ కూడా ఇవ్వకపోవడంతో డ్రైవర్లు, కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. మరోవైపు బస్సుల్లో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక రద్దీ దృష్ట్యా కండక్టర్లతో పాటు డ్రైవర్లకు సమస్యలు వస్తున్నాయని వెల్లడించారు. డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో డ్రైవర్లే టికెట్లు ఇవ్వాల్సి రావడంతో పని భారం పెరుగుతోందని వాపోతున్నారు. ఈమేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభించాలని, 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయడమే కాక 2025 వేతన సవరణ చేపట్టాలని కోరుతున్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం రూ.350 కోట్లను నెలనెలా విడుదల చేయాలని, ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆర్టీసీ స్థలాలను ఈవీ బస్సుల కంపెనీలకు ఇవ్వకుండా ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, ఉద్యోగులపై పనిభారం తగ్గింపు, కేఎంపీఎల్, ఏపీకే వేధింపులు మానుకోవాలని, 2019 సమ్మె కాలంలో నమోదైన కేసులను ఎత్తివేసి సంస్థలోని అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆర్టీసీలో చాలాకాలం తర్వాత కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. ఇదేసమయాన స్కూళ్లకు వేసవి సెలవులు రావడంతో వేలాది మంది ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. అయితే, సమ్మె దృష్ట్యా డిపోల వారీగా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. డిపోల పరిధిలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, ప్రైవేట్ బస్సులు నడిపే కార్మికుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు డిపోల్లో 286బస్సులు ఉండగా, 929 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతీరోజు లక్ష మందికి పైగా ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు.
డిపో బస్సులు సిబ్బంది
కొత్తగూడెం 69 204
భద్రాచలం 109 362
మణుగూరు 72 210
ఇల్లెందు 36 103
డిమాండ్ల సాధన కోసం కార్మికుల పోరుబాట
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం సాగుతుంది. ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని కార్మికులకు ఆండగా నిలవాలి. చాలారోజులుగా వేచి చూశాకే సమ్మెబాట పడుతున్నాం. ఆర్టీసీ కార్మికులను అణగదొక్కాలని చూస్తే సహించేది లేదు. జేఏసీ ఆధ్వర్యాన కార్మికులు, అన్ని యూనియన్లు పాల్గొంటాయి.
– కె.భాస్కర్‌రావు,
ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి


