ధాన్యం కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు

Apr 22 2026 7:36 AM | Updated on Apr 22 2026 7:36 AM

రైతులకు ఇబ్బంది లేకుండా...

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లా రైతులకు ఇబ్బంది ఎదురుకాకుండా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. తహసీ ల్దార్లు, ఎంపీడీఓలతో పాటు వివిధశాఖలతో అధికా రులు కలెక్టరేట్‌ నుంచి మంగళవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. జిల్లాలో 83, 635 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు 168 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని 56 కేంద్రాలకు ధాన్యం చేరినందున వ్యవసాయశాఖ అధికారులు గ్రేడింగ్‌ చేపట్టాలని చెప్పారు. అంతేకాక కేంద్రాల్లో టెంట్లు, తాగునీరు, విద్యుత్‌ వసతి సమకూర్చి సరిపడా టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం యంత్రాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే, రైస్‌ మిల్లర్ల నుంచి నిబంధనల ప్రకారం బ్యాంక్‌ గ్యారంటీలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

బూర్గంపాడు: యాసంగి ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా, పకడ్బందీగా చేపడతామని కలెక్టర్‌ అంకిత్‌ తెలిపారు. బూర్గంపాడు మార్కెట్‌యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నాణ్యంగా ఉన్న ధాన్యాన్ని సేకరించామని చెప్పారు. రైతులు అపోహలు పెట్టుకోవద్దని, ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. పీఆర్‌–126 దొడ్డు రకం నాణ్యతపై రైతుల సందేహాలను వ్యవసాయశాఖ అధికారులు నివృత్తి చేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు, తహసీల్దార్‌ కేఆర్‌కేవీ ప్రసాద్‌, ఎంపీడీఓ జమలారెడ్డి, ఏఓ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ బూర్గంపాడులోని కేజీబీవీని తనిఖీ చేశారు. విద్యార్థులకు సమకూరుస్తున్న భోజనం, వంట సామగ్రిని పరిశీలించాక మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ క్రమాన టాలెంట్‌ టెస్ట్‌. డ్రాయింగ్‌ పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల అభినందించారు.

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలో ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ను ప్రణాళికాయుతంగా గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. ఏఈఆర్‌ఓలు, బూత్‌ లెవల్‌ అధికారులు, సూపర్‌వైజర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించిన ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 70 శాతం ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ పూర్తయిందని, మిగిలిన పనులను అత్యంత ప్రాధాన్యతతో వేగంగా చేపట్టాలని స్పష్టం చేశారు. మణుగూరు మండలంలో కేవలం 37శాతమే పూర్తికావడంపై కారణాలు ఆరా తీశారు. మ్యాపింగ్‌లో పారదర్శకత, కచ్చితత్వం పాటించాలని ఆదేశించారు. అనంతరం సాదా బైనమా దరఖాస్తులపై కలెక్టర్‌ సమీక్షించారు.

కలెక్టర్‌ అంకిత్‌

Advertisement
 
Advertisement
Advertisement