భద్రాచలంటౌన్: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణా ళిక’లో భాగంగా గిరిజన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఈనెల 24న భద్రాచలం వైటీసీలో అవగాహన సద స్సు ఏర్పాటుచేసినట్లు ఐటీడీఏ పీఓ బి. రాహుల్ తెలిపారు. బ్యూటీ థెరపిస్ట్, జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ వంటి కోర్సుల్లో శిక్షణకు 8వ తరగతి నుంచి డిగ్రీ విద్యార్హత కలిగి 18 – 35 ఏళ్ల వయస్సు వారు అర్హులని వెల్లడించారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి, యూనిఫాం, స్టడీ మెటీరియల్ సమకూర్చడమే కాక పూర్తయ్యాక సర్టిఫికెట్లు అందజేస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, ఫొటోలు, విద్యార్హతల సర్టిఫికెట్లతో ఈనెల 24న సదస్సుకు హాజరుకావాలని, వివరాలకు 93474 66615, 63026 08905, 93912 92594 నంబర్లలో సంప్రదించాలని పీఓ సూచించారు.
కొత్త విద్యాసంవత్సరానికి సిద్ధం కావాలి
కొత్తగూడెంఅర్బన్/సూపర్‌బజార్ (కొత్తగూడెం): ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రగతిని సమీక్షించుకొని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి స్పష్టమైన ప్రణాళికతో సిద్ధం కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి.నాగలక్ష్మి సూచించారు. జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, హెచ్‌ఎంలు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లతో మంగళవారం ఆమె కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం వివిధ స్థాయిల్లో ప్రగతి, లోటుపాట్లను సమీక్షించుకోవడం ద్వారా వచ్చే విద్యాసంవత్సరం మెరుగైన ప్రణాళిక అమలుకు అవకాశముంటుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించడమే కాక మూతబడిన పాఠశాలను తిరిగి తెరిపించేందుకు కృషి చేయాలని సూచించారు. అలాగే, పాఠశాలల్లో మరమ్మతులు, నిర్మాణ పనులపై ఆమె సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి ఏ.నాగరాజశేఖర్, సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ ఎస్.కే.సైదులు, ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్.సతీష్‌కుమార్, బాలిక విద్యా కోఆర్డినేటర్ జే.అన్నామణి పాల్గొన్నారు.
బీఏఎస్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
భద్రాచలంటౌన్: బెస్ట్ అవైలబుల్ పథకం(బీఏఎస్) కింద జిల్లాకు చెందిన అర్హులైన గిరి జన విద్యార్థులు 3, 5, 8వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. మొత్తం 156 సీట్లు అందుబాటులో ఉండగా, 3వ తరగతికి 78, 5వ తరగతికి 39, 8వతరగతికి 39సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. దమ్మపేట, భద్రాచలం, ఇల్లెందు గిరిజన సంక్షేమ కార్యాలయాలతో పాటు ఐటీడీఏ కార్యాలయంలో లభించే దరఖాస్తులు తీసుకుని మే 7వ తేదీలోగా పూర్తి వివరాలతో అందజేయాలని తెలిపారు. మే 14న ఐటీడీఏ కార్యాలయంలో జరిగే లాటరీ ప్రక్రియలో విద్యార్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు దరఖాస్తులకు కులం, నివాసం, ఆదాయ ధ్రువపత్రాలు (గ్రామీణ వాసులైతే రూ.1.50 లక్షలు, పట్టణ వాసులైతే రూ.2 లక్షలులోపు) జతపర్చాలని పీఓ సూచించారు.
మిర్చి ధర
వెనకడుగు
ఖమ్మంవ్యవసాయం: మిర్చి ధరకు కళ్లెం పడింది. సోమవారం వరకు దూకుడు ప్రదర్శించిన ‘తేజా’ రకం మిర్చి ధర మంగళవారం వెనకడుగు వేసింది. ఖమ్మం మార్కెట్‌లో క్వింటా మిర్చికి సోమవారం అత్యధికంగా రూ.22 వేల ధర పలకగా, మంగళవారం రూ.600 తగ్గి రూ.21,400గా నమోదైంది. అంతేకాక మోడల్ ధర రూ.20,500 నుంచి రూ.18 వేలకు పడిపోయింది. జాతీయంగా, అంతర్జాతీయంగా ఆశించిన స్థాయిలో ఆర్డర్లు లేకపోవడం, ప్రస్తుతం వస్తున్న మిర్చి చివరి కోత కావడంతో నాణ్యత లేకపోవడం ధర తగ్గడానికి కారణాలుగా చెబుతున్నారు.


