మమ్ముల్ని పట్టించుకోండి.. | - | Sakshi
Sakshi News home page

మమ్ముల్ని పట్టించుకోండి..

Apr 22 2026 7:36 AM | Updated on Apr 22 2026 7:36 AM

మమ్ముల్ని పట్టించుకోండి..

ఇల్లెందురూరల్‌: ఏజెన్సీ చట్టాలు.. రాజ్యాంగం కల్పించిన హక్కులు.. ఏవీ వారికి ఊరటనివ్వలేకపోతున్నాయి. వాటిని అమలు చేయాల్సిన అధికారులు ఆదుకునే ప్రయత్నం చేయడం లేదు. ఫలితంగా దశాబ్ధాలుగా ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలను అందుకోలేక.. ఉపాధి కోసం కూలీలుగానే దుర్భర స్థితిలో ఇల్లెందు ఏజెన్సీలోని పలు గ్రామాలలో గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. బుధవారం మండలంలో పర్యటిస్తున్న రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ సమస్యలను ఆలకించి పరిష్కారం చూపాలని ఏజెన్సీ వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఆక్రమణలోనే ప్రభుత్వ భూములు

మండల, పట్టణ పరిధిలో ప్రభుత్వ భూములు అధికారుల కనుసన్నల్లోనే ఆక్రమణకు గురవుతున్నాయి. గతేడాది పర్యటనకు వచ్చిన మంత్రి ప్రభుత్వ భూముల ఆక్రమణలను చూసి నిర్ఘాంతపోయి పక్షం రోజుల్లో స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కానీ నేటికీ ఆచరణకు నోచుకోలేదు.

40 ఏళ్లుగా అపరిష్కృతంగానే..

మామిడిగుండాల రెవెన్యూ పరిధిలో 40 ఏళ్లుగా సీలింగ్‌ భూముల సరిహద్దు వివాదం కొనసాగుతూనే ఉంది. 1990కి ముందే నాటి రెవెన్యూ అధికారులు స్థానిక గిరిజన రైతులకు సీలింగ్‌ పట్టాలు ఇచ్చారు. కానీ పట్టాలలో సరిహద్దులు పేర్కొనకపోవడంతో ఎవరి భూమి ఎక్కడుందో నేటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఫలితంగా గిరిజన రైతులు రైతు భరోసాకు, రైతు బీమాకు నోచుకోవడం లేదు.

అవసరం కోసం అక్కున చేర్చుకొని..

అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి పురుడు పోసింది కూలీలే. ప్రమాదాల గనులుగా పేరొందిన బొగ్గు బావుల్లో వందేళ్ల క్రితం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని శ్రమించి పని చేసిన కూలీలు సంస్థను నిలబెట్టారు. నాడు తమ పూర్వీకులు నిర్మించిన ఆవాసాలలో వారి వారసులు అసౌకర్యాల నడుమనే నేటికీ జీవనం సాగిస్తున్నారు. వారిని ప్రస్తుతం జేకే ఓసీ విస్తరణ ప్రాజెక్టు పేరుతో ఖాళీ చేయించే ప్రయత్నం జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement