డీఏఓ బాబూరావు
ఇల్లెందురూరల్: రైతుభరోసా సహా పథకాల లబ్ధికి ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి అని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు తెలిపారు. మండలంలోని చల్లసముద్రం గ్రామపంచాయతీ మీ సేవ కేంద్రం వద్ద రైతులతో సోమవారం సమావేశమై ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాధాన్యత, నమోదు విధానం, ప్రభుత్వ పథకాల లబ్ధి వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే రైతుభరోసా సహా ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరుతుందన్నారు. ఏవో సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.
మోసం చేసిన వ్యక్తిపై
కేసు నమోదు
భద్రాచలంఅర్బన్: పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బూర్గంపాడు మండల పరిధి సారపాక గ్రామానికి చెందిన సాయి అనే వ్యక్తి భద్రాచలం పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగదీసుకోవడంతో ఆమె గర్భం దాల్చింది. మూడు నెలల క్రితం డెలివరీ కాగా సదరు యువతి మగ శిశువుకి జన్మనిచ్చింది. కాగా, పెళ్లి చేసుకోవాలని ఆమె అడగగా సాయి నిరాకరించాడు. దీంతో బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ సతీష్ కేసు నమోదు చేశారు.


