ఆమోదం పొందినా.. అలసత్వం
అరకొరగా చలివేంద్రాలు ఏర్పాటు
తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న కార్మికులు, ప్రజలు
పాలకవర్గ సమావేశంలో
రూ.6 లక్షలు కేటాయింపు
ఆచరణలోనికి రాని ఆమోదం పొందిన అంశాలు
చలివేంద్రాల సంఖ్య పెంచాలి
కొత్తగూడెంఅర్బన్: బొగ్గు గనుల ప్రాంతం.. తీవ్ర మైన ఎండ, భరించలేని ఉక్కపోత.. వెరసి కార్పొరేషన్ ప్రజలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనిమీద బయటకు వెళ్లినవారికి దాహం వేస్తే చలివేంద్రాలు కనిపించడం లేదు. కార్పొరేషన్ పాలకవర్గం సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొందిన పలు అంశాలను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.. సుమారు 21 రోజుల కిందట పాలకవర్గ సర్వసభ్య సమావేశంలో రూ.6 లక్షలతో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సభ్యులు ఆమోదించగా.. శనివారం అరకొరగా.. చలివేంద్రాలు ఏర్పాటు చేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కమిషనర్ అనుభవ రాహిత్యంతో అభివృద్ధి పనులు జరగడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మార్చి నుంచే ఎండల తీవ్రత
మార్చి నుంచే ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం ప్రతీ రోజు ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటుతుండడంతో దాహానికి ప్రజలు, కార్మికులు, ఆటోడ్రైవర్లు అవస్థలు పడుతున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీగా ఉన్న సమయంలో ప్రధాన కూడళ్లలో ఆరు వరకు చలివేంద్రాలు మూడు నెలల పాటు ఏర్పాటు చేసేవారు. ప్రతీ రోజు చలివేంద్రంలో ఏర్పాటు చేసిన మట్టికుండల్లో నీటిని నింపి పాదచారులతో పాటు గా అన్నివర్గాల వారికి తాగునీటి సదుపాయం కల్పించే వారు. ప్రస్తుతం మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా రూపాంతరం చెందిన నేపథ్యంలో చలివేంద్రాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. కానీ, పాలకవర్గం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎండల్లో ప్రజలు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఇంకో వారం రోజులు అయితే ఏప్రిల్ కూడా ముగిసిపోతుంది. అయినా కూడా అధికారులలో చలనం లేకపోవడంపై కార్పొరేటర్లతో పాటు ప్రజలు కూడా వారి తీరును తప్పుబడుతున్నారు. శనివారం కార్పొరేషన్ పరిధిలోని కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్‌లలో చలివేంద్రాలను అరకొరగా ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
కొత్తగూడెం కార్పొరేషన్ పాలకవర్గ సర్వసభ్య సమావేశం గత నెల 28వ తేదీన జరిగింది. ఎజెండాలోని 6వ అంశంగా చలివేంద్రాల ఏర్పాటు కోసం చర్చలు జరిపారు. అనంతరం పాలకవర్గ సభ్యులు ఆమోదించారు. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్‌లలో 12 చోట్ల రూ.6 లక్షలతో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే నిర్ణయం తీసుకొని 21 రోజుల తరువాత అరకొరగా చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లు ఉన్న చోట తప్పనిసరిగా చలివేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. బీ–గ్రేడ్ మున్సిపాలిటీకి కమిషనర్‌గా వ్యవహరించాల్సిన వారిని కార్పొరేషన్ కమిషనర్‌గా కొనసాగించడంతో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని, కార్పోరేషన్ స్థాయికి ఐఏఎస్ అధికారిని వీలైనంత త్వరగా నియమించాలని కార్పొరేటర్లు సహా ప్రజలు కోరుతున్నారు. ప్రధాన కూడళ్లలో వ్యాపారం చేసే వారు, ఆటో యూనియన్ల వారు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్‌లలో చలివేంద్రాల సంఖ్యను పెంచాల్సిన అవసరముంది. ఎండలు పెరిగిపోవడంతో ప్రజలు నీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడళ్లలో చలివేంద్రాల సంఖ్యను పెంచి, అన్ని వర్గాల ప్రజలకు నీటి సదుపాయం కల్పించాలి. –సాగర్ మలోత్రా, కార్పొరేటర్


